పొలిటికల్ గేమ్ ఛేంజర్ డేట్ … జూన్ 23

ఈనెల 23వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం చాలా కీలకమంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ అనే విషయంలో దేశవ్యాప్త సర్వే జరిపించారట. దాని ఫలితాలపై చర్చించేందుకు, విశ్లేషించేందుకే ఈ భేటీ జరగబోతోందని సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం మొత్తం 543 పార్లమెంటు సీట్లలో 450 నియోజకవర్గాల్లో బీజేపీతో కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పరిస్ధితులు ఉన్నట్లు తేలిందట.

బీజేపీతో పోటీ ఇంత టఫ్ ఫైట్ గా ఉన్నపుడు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీని ఓడించటం పెద్ద కష్టం కాదని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెబుతున్నారు. అందుకనే నితీష్ మొదటినుండి బీజేపీ మీద ప్రతిపక్షాల అభ్యర్ధులు వన్ ఆన్ వన్ అన్నపద్దతిలో పోటీచేయాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్+ఇతర ప్రతిపక్షాల్లో దేనికి బలముందని నిజాయితీతో విశ్లేషించుకుని అన్నీపార్టీలు కలిసి ఉమ్మడి ఒక్క అభ్యర్ధినే పోటీలోకి దింపాలని నితీష్ చెబుతున్నారు.

నిజానికి నితీష్ ప్రతిపాదన ఆచరణలోకి రావటం చెప్పినంత సులభంకాదు. అలాగని ఆచరణ సాధ్యంకానంత కష్టమూ కాదు. కాకపోతే ప్రతిపక్షాలు నిజాయితీతో త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ మాత్రమే. బెంగాల్లో బీజేపీకి మమతాబెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ సవాలు విసురుతోంది. ఇక్కడ కాంగ్రెస్ వాయిస్ ఏమీలేదు. కానీ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. ఇదే సమయంలో స్ధానికంగా ఉన్న ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

అందుకని బీజేపీని ఎదుర్కోవటంలో త్యాగాలు చేయాలంటే ప్రాంతీయపార్టీలు సిద్ధంగా ఉంటాయా అన్నదే పెద్ద ప్రశ్న. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ కూడా పోటీనుండి తప్పుకుని ప్రతిపక్షాలకు మద్దతు ఇవాల్సుంటుంది. ఇవన్నీ కూడా త్యాగం, నిజాయితీగా జరగాల్సిన వ్యవహారాలు. ఇక్కడ తేడా వచ్చిందంటే ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినేస్తంది. పైగా తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుంటే బీజేపీ చూస్తు ఊరుకోదు. ఏదోరకంగా దెబ్బతీయటానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి 23వ తేదీన జరగబోయే భేటీ ఆసక్తిగా మారింది.