ఇపుడు సమస్యంతా అటు తిరిగి ఇటుతిరిగి నాదెండ్ల మనోహర్కి చుట్టుకునేట్లుంది. తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమైపోయింది. ఇద్దరు అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించటమే మిగులుంది. దాని తర్వాత అంకం ఏమిటంటే పోటీచేసే సీట్లసంఖ్య తర్వాత ఆ నియోజకవర్గాలు ఏవనేవి. ఇక్కడే సమస్య మొదలవ్వబోతోంది నాదెండ్లకు. జనసేనలో పవన్ తర్వాత అంతటి ముఖ్యస్ధానం నాదెండ్లదే అనటంలో సందేహంలేదు. కాబట్టి ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా తిరుగులేదు.
కానీ ఇదంతా ఎప్పుడంటే ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాత్రమే. టీడీపీతో పొత్తనేటప్పటికి నాదెండ్ల కోరిక తీరే అవకాశం దాదాపు లేదనే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే నాదెండ్ల కోరుకుంటున్న సీటు అంత హాటుసీటు మరి. నాదెండ్ల మొదటి నుండి పోటీచేస్తున్నది తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండే. రెండు సార్లు గెలిచి, రెండుసార్లు ఓడిపోయారు. ఇదే నియోజకవర్గం నుండి టీడీపీ తరపున మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోటీ చేయబోతున్నారు.
పార్టీలోని సీనియర్ తమ్ముళ్ళల్లో ఆలపాటి కూడా ఒకళ్ళు. అంటే తెనాలి సీటుకోసమే ఇటు పవన్ అటు చంద్రబాబు పట్టుబట్టే అవకాశముంది. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో నాదెండ్లకు సుమారు 30 వేల ఓట్లొస్తే ఆలపాటికి సుమారు 76 వేల ఓట్లొచ్చాయి. ఈ లెక్కన ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు వదులుకోవటం కష్టమనే అనిపిస్తోంది. వైసీపీ ఎంఎల్ఏ అన్నాబత్తుని శివకుమార్ మీద మళ్ళీ ఆలపాటి పోటీ చేస్తేనే పోటీ గట్టిగా ఉంటుంది.
ఆలపాటి కాకుండా నాదెండ్లయితే తేలిపోతారనటంలో సందేహంలేదు. ఎందుకంటే నాదెండ్లకన్నా ఆలపాటికి నియోజకవర్గంలో పట్టెక్కువ. క్యాడర్ ను తీసుకున్నా జనసేనకన్నా టీడీపీకే ఎక్కువ.
మరి ఈ సీటు విషయంలో చంద్రబాబు, పవన్ ఆలోచనలు ఎలాగున్నాయో ఇప్పటికైతే ఎవరికీ తెలీవు. తెలుగుదేశంపార్టీకి ఉన్న కీలకమైన నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటని అందరికీ తెలిసిందే. ఒకవైపు పొత్తులు చంద్రబాబు, పవన్ డిసైడ్ చేస్తారని చెబుతున్న నాదెండ్ల మరోవైపు తెనాలిలో తానే పోటీచేస్తానని పదేపదే చెబుతున్నారు. మరీ పరిస్ధితుల్లో ఈ నియోజకవర్గాన్ని త్యాగంచేసే పార్టీ ఏదనే విషయంలో సస్సెన్స్ పెరిగిపోతోంది. మరి సస్పెన్స్ ఎప్పుడు విడిపోతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates