వైసీపీ మ‌హిళా ఎంపీ భూక‌బ్జా.. సొంత వ‌దినే రోడ్డెక్కారుగా!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. క‌ర్నూలుకు చెందిన మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చ‌ర‌ణ్‌ల‌పై భూముల క‌బ్జాకు సంబంధిం చిన ఆరోప‌ణ‌లు పుంఖాను పుంఖాలుగా వ‌చ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్త‌లు వ‌చ్చినా.. ఎన్ని ఆరోప‌ణలు వ‌చ్చినా.. వైసీపీ ప్ర‌భుత్వం లెక్క‌చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీతపై సొంత కుటుంబ స‌భ్యులే భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేశారు. ఆమెపై ఏకంగా స్పంద‌న‌లో ఫిర్యాదు రావ‌డం.. ఎంపీ పేరు కూడా ఉండ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. తమ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఎంపీ వదిన కళావతి ఆరోపించారు. తిరిగి వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు స్పంద‌న కార్య‌క్ర‌మంలో ఫిర్యాదు చేశారు. 2006లో తమ ఆస్తులు తన భర్త కృష్ణ కుమార్ తో బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు.

2010లో ఆయన చనిపోయారని కళావతి తెలిపారు. ఆ తర్వాత తమ ఇంట్లో దొంగతనం చేయించి బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఆస్తుల కోసం తమ పిల్లలు న్యాయస్థానంలో పోరాడుతుంటే చంపేస్తామని ఎంపీ వంగా గీత బెదిరిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వంగా గీత దంపతులు, సోదరి కుసుమ కుమారి దంపతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లాకు కళావతి ఫిర్యాదు చేశారు.

క‌ళావ‌తి ఫిర్యాదు మేర‌కు.. ఎంపీ గీత వ్య‌వ‌హారం ఇలా.. ఉంది.

భూక‌బ్జా – 6 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి
భూక‌బ్జా – 600 గ‌జాల ఇల్లు
బంగారం – 50 కాసులు
న‌గ‌దు – ఇంట్లో ఉన్న 50 వేల రూపాయ‌ల‌ను గీత అనుచ‌రులు దోచుకెళ్లార‌ని ఆమె ఆరోపించారు.