జనాలూ.. నా మాట వినండి.. అంటూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చేఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పాలన అంతానికి అందరూ నడుం బిగించాలని అన్నారు. చట్టసభల్లో జరగాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయం వేదికగా సాగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంపు కార్యాలయంలో సాగుతున్నాయని, ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని, కనీసం 15 రోజులు కూడా నిర్వహించడం లేదని తెలిపారు. సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన రాష్ట్రంలో నడుస్తోందని, ఏదీ రాజ్యాంగపరంగా జరగడం లేదని చెప్పారు. దోపిడీకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. శాసన సభ నుంచి గ్రామ పంచాయతీ సభల వరకూ దేనికీ విలువలు లేవు అని పేర్కొన్నారు.
గతంలో 60 రోజులు జరిగే శాసన సభ సమావేశాలు 15 రోజులకు తగ్గిపోయాయని ఆనం తెలిపారు. ప్రజల అవసరాలు పట్టించుకోవటం లేదని, ప్రాజెక్టుల పనులు జరగడం లేదని, జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా పరిపూర్ణత లేదని అన్నారు. అందుకనే వాటికి వెళ్లడం లేదు.. ఏ అధికారి కూడా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని తెలిపారు. వాలంటీర్లకే సర్వ హక్కులు ఉన్నాయన్న ఆనం.. తాజాగా గృహ సారథులు వచ్చారని అన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లకు కూడా అధికారాలు లేవని చెప్పారు. మన రాష్టంలో మందు తాగే వాళ్లకు లివర్, కిడ్నీలు పాడై పోయి ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని, జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతోందని ఎమ్మెల్యే ఆనం తెలిపారు. ఈ నేపథ్యంలోనే జనాలు బాగా ఆలోచించి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని నిలువరించి.. తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.