జాతీయనేతలే దిక్కా?

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వందఓట్లు రావాలంటే కేంద్రంలోని నేతలే దిక్కయ్యేట్లున్నారు. కేంద్రనేతలంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలాంటి వాళ్ళన్నమాట. వీళ్ళల్లో నడ్దాను ఏపీలో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అనే హోదా ఉంది కాబట్టి ప్రాధాన్యత దక్కుతోందంతే. ఇపుడు విషయం ఏమిటంటే ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 10వ తేదీన జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన అనేక కార్యక్రమాల్లో అమిత్ పాల్గొనబోతున్నారు. పార్టీ నేతలతో కూడా సమావేశం అవబోతున్నారు. బహుశా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అలాగే నడ్డా తిరుపతిలో ఏర్పాటుచేసిన పర్యటనల్లో పాల్గొనబోతున్నారు. నడ్డా పర్యటనలో కూడా సీనియర్ నేతలంతా పార్టిసిపేట్ చేస్తారనటంలో సందేహంలేదు.

వచ్చేనెలలో నరేంద్రమోడీ కూడా ఏపీలో పర్యటించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ నేతల్లో చాలామంది మీడియా సమావేశాలకు, టీవీల్లో డిబేట్లకు తప్ప ఇంకెందుకు పనికిరారు. వీవీఐపీలు వచ్చినపుడు విమానాశ్రయాల్లో స్వాగతం చెప్పి, మళ్ళీ సెండాఫ్ ఇచ్చే దగ్గర మాత్రం చాలామంది నేతలు కనబడుతారు. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ కనబడరు. పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయటంలో వీళ్ళకి ఎంతమాత్రం శ్రద్ధున్నట్లు కనబడటంలేదు.

ఇపుడున్న నేతల్లో చాలామందికి సొంతంగా వందఓట్లు వేయించుకునేంత శక్తికూడా లేదు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం అంటేనే పార్టీ నేతల బలమేమిటో అర్ధమైపోతోంది. నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కి వచ్చిన ఓట్లు 4 శాతం. 175 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బలమైన అభ్యర్ధులు కూడా లేరు. కాబట్టి ఇక పార్లమెంటు అభ్యర్ధుల గురించి చర్చే అవసరంలేదు. అన్నీ నియోజకవర్గాలకు పోటీచేసిన తర్వాత ఎంతమందికి డిపాజిట్లు దక్కుతాయనేది పెద్ద పజిల్ అయిపోయింది. కేంద్రంలో బలంగా ఉందికాబట్టే ఏపీలో బీజేపీని పట్టించుకుంటున్నారు లేకపోతే ఎవరూ లెక్కకూడా చేసేవారు కాదన్నది అందరికీ తెలిసిందే. మరి జాతీయ నాయకులు వచ్చి ఏమిచేస్తారో చూడాల్సిందే.