ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మూడు రాజధానుల మాటను వాస్తవరూపం దాల్చేలా చేయటంతో పాటు.. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చాలన్న పట్టుదలతో యువ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ తన ప్రభుత్వ ఎజెండాగా ఉన్న మూడు రాజధానులకు.. మోడీ ఆమోదముద్ర ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? అంటే అవునని చెప్పాలి.
తన తాజా కాన్సెప్ట్ అయిన మూడు రాజధానుల అంశాన్ని పీఎంవోకు లేఖ రాయటం.. అపాయింట్ మెంట్ కోసం టైం కోరటం చూస్తుంటే.. మోడీ అభయహస్తంతోనే రాజధాని వ్యవహారం ముందుకు వెళుతుందన్న సంకేతాల్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా అర్థం కాక మానదు. మరి.. జగన్ కోరినట్లే ప్రధాని మోడీ విశాఖ శంకుస్థాపనకు వస్తారా? అన్నది క్వశ్చన్.
ఏపీ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లుగా మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై స్పష్టత. పూర్తిగా జగన్ రాజకీయ ఎజెండాతో ఏర్పాటు అవుతున్న మూడు రాజధానుల వ్యవహారంలోకి ప్రధాని మోడీ తలదూర్చరన్న మాట బలంగా వినిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనను ఆర్భాటంగా నిర్వహించిన నేపథ్యంలో.. మరో రాజధాని శంకుస్థాపనకు హాజరు కావటం ద్వారా.. తన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే ప్రమాదం ఉందన్న అంశంపై మోడీ రాకపోవచ్చని చెబుతున్నారు.
ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన వైనంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేకున్నా.. శంకుస్థాపన పేరుతో ఇప్పుడు తమను లాగే ప్రయత్నాన్ని సీఎం జగన్ చేస్తున్నారన్న మాటను ఏపీ బీజేపీ నేతల నోట రావటం గమనార్హం. మంచికో చెడుకో ఒక రాజధాని ఎంపికై.. దాని శంకుస్థాపన జరిగిన తర్వాత.. మరోసారి అదే పేరుతో ఏపీకి రావటం ప్రధాని మోడీకి నష్టమే తప్పించి లాభం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమిపూజ కోసమైతే.. ప్రధాని మోడీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.