ఏపీ రాజకీయాల్లో పార్టీలు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ఏ వర్గానికి లబ్ధి చేకూరితోంది. ఏ వర్గం నష్టపోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు కోరుకునేది సంక్షేమ అభివృద్ధి. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వాలు అనుకూలంగా ఉండాలని తమకు అనుకూలంగా పనిచేయాలని కోరుకుంటారు. కానీ ఏపీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏ వర్గం ప్రజలు కూడా ఆసక్తిగా లేరు అని చెప్పాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రకటించేసి అధికారంలోకి వచ్చేస్తున్నటువంటి ప్రభుత్వ వచ్చేయాలి అనేటటువంటి వ్యూహంతో ఉన్న పార్టీలు లేదా సంక్షేమా న్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మెజారిటీ ప్రజలను పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో పన్నులు కడుతున్నటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారు. చెత్త పనుల నుంచి పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ వరకు కూడా అనేకమైనటువంటి పన్నులు వసూలు చేస్తున్నారు. జీఎస్టీ సర్వీస్ టాక్స్ ఇవన్నీ కూడా ప్రజలకు చాలా భారంగా మారి దినదిన గండం లాగా జనాలు జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు అసలు రాజకీయ వ్యూహాలతో పార్టీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఒక విధంగా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఈ రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి సంక్షేమ వ్యూహాల్ని వేసుకుని ముందుకు సాగడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరు నష్టపోతున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ప్రతి ఒక్క విషయంలో కూడా పార్టీల నుంచి ప్రజలకు మేలు జరగాల్సింది పోయి ఒక వర్గం ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమ పథకాలు ప్రకటిస్తాం అనేటటువంటిది మిగిలిన వర్గాలను నిరాశకి గురిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవడి పథకాన్ని తీసుకుంటే 15 వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఇటు టిడిపి అటు వైసిపి చెబుతున్నాయి.
మరి ఈ డబ్బులు ఎవరి జేబులోంచి ఇస్తారు? ప్రజల నుంచి వసూలు చేసేటటువంటి పన్నుల నుంచే కదా మరి నిజానికి ఇంత సొమ్ము ఇవ్వడానికి ఎంత మేరకు టాక్స్ లు పెంచాల్సి వస్తుంది. అదేవిధంగా రైతు భరోసా కింద 20 వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక ఇప్పటికే వైసిపి ప్రభుత్వం 7,000 కలిపి కేంద్రం ఇస్తున్న 6000 తో 13వేల రూపాయలు చొప్పున వారికి ఇస్తుంది. ఇక ఇతర వైయస్సార్ భరోసా, వాహన మిత్ర, ఇవన్నీ ఇస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం ఇస్తున్నారు? అసలు మెజారిటీ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచే కదా? మరి ప్రభుత్వాలని ఎంపిక చేసుకునేది కేవలం ఒక వర్గాన్ని పోషించడానికి… ఒక వర్గం లబ్ధి కోసం.. ఓటేసి పార్టీలను అధికారంలోకి తీసుకురావాలా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇది పార్టీల పట్ల ప్రజలకు విముఖత పెంచేటటువంటి ప్రమాదం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ఓటర్లలో ఇది ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. మేం కడుతున్నటువంటి పన్నులు తీసుకువెళ్లి ఒక వర్గాన్ని అభివృద్ధి చేయటం వల్ల మాకేంటి ప్రయోజనం మీరు రోడ్లు వేస్తానని చెప్పరు. పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పరు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పరు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పరు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పరు. కేవలం మేము కడుతున్నటువంటి పన్నుల ద్వారా ఒక వర్గం ప్రజలకు మాత్రమే డబ్బులు పంచుతారా? అని పెదవి విరుస్తున్నారు.
కాబట్టి పార్టీలు సమయమనం పాటించి ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో మేళవించి రాజకీయాలు చేయాలి అనేది మేధావుల సూచన. గతంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇదే ప్రాతిపదికన జరిగి ఉంటే ఈ మాత్రమైనా దేశం, రాష్ట్రం అభివృద్ధిలో నడిచేవా? ఉత్తిపుణ్యానికే కూర్చోపెట్టుకొని డబ్బులు ఇస్తామని ఏనాడు ఏ పార్టీ కూడా చెప్పలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్టీరామారావు ప్రభుత్వం రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాల తప్ప మిగిలినటువంటి వాటిని ఏదీ కూడా ఆయన ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడలేదు.
మరి ఆ స్ఫూర్తి ఇప్పుడు ఏమైంది? వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేవలం అత్యంత కీలకమైన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు తప్ప ఇలా కూర్చోబెట్టి ఉచితంగా 15000 ఇస్తాం ఉచితంగా 20000 ఇస్తాం ఉచితంగా నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించలేదు. మరి ఆయన ప్రజాభిమానం పొందలేదా ఆయన ప్రజల మనిషిగా నిలబడలేదా మరి ఎందుకు ఈ రోజు ఇలా ఇంత గాడితప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.