మహానాడు.. ఆ న‌లుగురు ఏమ‌య్యారు?

అత్యంత కీల‌క‌మ‌ని టీడీపీ అధినేత చెబుతూ వ‌చ్చిన మ‌హానాడు.. ముగిసింది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో గెలు పే ల‌క్ష్యంగా ఆయ‌న ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌.. త‌న ఇమేజ్‌క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నిక ల్లో వైసీపీని చిత్తుగా ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే.. ఇంత ఇంపార్టెంటు అని చెబుతున్న మ‌హానాడుకు న‌లుగురు కీల‌క నాయ‌కులు.. డుమ్మా కొట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వారిలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజ‌య్ కృష్ణ రంగారావు, గుంటూరుకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ఆయ‌న త‌న‌యుడు రంగారావు వంటివారి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు.. 2017లో వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సైకిల్ ఎక్కిన 23 మంది ఎమ్మెల్యేల్లో .. 15 మంది వ‌ర‌కు ఇప్పుడు మ‌హానాడుకు డుమ్మా కొట్టారు.

సొంత జిల్లాకు చెందిన వంత‌ల రాజేశ్వ‌రి.. వంటి వారు కూడా రాలేదు. ఇక‌, జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన గిడ్డి ఈశ్వ‌రి కూడా క‌నిపించ‌లేదు. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు చెందిన‌ జ‌లీల్ ఖాన్ మాత్రం కొంత హ‌డావుడి చేశారు. అయితే.. ఇక్క‌డ కూడా బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గం.. ఒక ర‌కంగా.. జ‌లీల్ ఖాన్ మ‌రోర‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో మ‌హానాడులో ఈ కీల‌క నేత‌ల మిస్సింగుల‌పై పార్టీలోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది.

మ‌రి వారుఉద్దేశ పూర్వ‌కంగానే డుమ్మా కొట్టారా?  లేక‌.. ఏదైనా బ‌ల‌మైన కార‌ణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. పైన చెప్పుకొన్న నాయ‌కుల్లో చాలా మంది.. వైసీపీకి మ‌ళ్లీ ట‌చ్‌లో ఉన్నార‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అదేస‌మ‌యంలో ఇది క‌రెక్ట్ కాదు..పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల నేప‌థ్యంలోనే ఇలా వారు దూరంగా ఉన్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదేమైనా ..చంద్ర‌బాబు వీరికి ఎలాంటి క్లాస్ ఇస్తారో చూడాలి.