అవినాష్‌కు హ‌క్కులు లేవా? ఎందుకీ వ్యాఖ్య‌లు..

Viveka

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణకు స‌హ‌క‌రిస్తున్న‌ప్ప‌టికీ.. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని.. టీడీపీ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను మేధావులు, రాజ‌కీయ విశ్లేషకులు త‌ప్పుబ‌డుతున్నారు. సీబీఐ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా.. సాద్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌న హాజ‌ర‌వుతున్నార‌ని వారు చెబుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో విచార‌ణ‌కు హాజ‌రు కాలేక‌పోతే.. ఆ విష‌యాన్ని దాచ‌కుండా సీబీఐకి వెల్ల‌డిస్తున్నార‌ని.. దీనిని త‌ప్పుబ‌ట్ట‌డం ఎందుక‌ని వారు అంటున్నారు.

ఇటీవ‌ల కాలంలో టీడీపీ అనుకూల మీడియాలో చ‌ర్చలు జోరుగా సాగుతున్నాయి. అవికూడా అవినాష్‌రెడ్డిని దోషిగా చూపిస్తున్నట్టు సాగుతుండ‌డం.. తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. వంటివి మేధావుల‌ను ఆవేద‌న‌కు గురిచేస్తున్నాయి. ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఏకంగా ఒక పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్య‌క్తి.. డబ్బు మూటలు తీసుకుని జడ్జ్ మెంట్లు ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలు, జడ్జీల మీద బహిరంగ ఆరోపణలు చేయ‌డాన్ని మేధావులు త‌ప్పుబ‌డుతున్నారు.

అంతేకాదు.. సీబీఐని అవినాష్ రెడ్డి ఆడిస్తున్నారంటూ.. కొంద‌రు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా మేధావులు దుయ్య‌బ‌డుతున్నారు. దేశంలో ఉన్న చ‌ట్టం, న్యాయ‌స్థానాలు చ‌ట్ట ప్ర‌కారం క‌ల్పించిన వెసులుబాటును అది కూడా చ‌ట్ట ప‌రిధిలోకి లోబ‌డి అవినాష్ రెడ్డి వినియోగించుకుంటున్నార‌ని.. వారు చెబుతున్నారు.

ముంద‌స్తు బెయిల్ పొందే హ‌క్కు చ‌ట్ట‌మే ప్ర‌తి వ్య‌క్తికీ క‌ల్పించింద‌ని.. దీనిని అంద‌రూ వినియోగించుకుంటున్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. దీనిపై విచార‌ణ చేసిన కోర్టులు.. అది స‌బ‌బో కాదో నిర్ణ‌యిస్తాయ‌ని.. ఆ మాత్రానికే.. అవినాష్‌రెడ్డి సీబీఐతో ఆడుకుంటున్నార‌ని ఎలా చెబుతార‌ని పేర్కొంటున్నారు.

పైగా.. అవినాష్‌రెడ్డి ఒక వ్య‌క్తి కాద‌ని.. క‌డ‌ప పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని.. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ఉండే బాధ్య‌త‌లు కూడా ఎక్కువేన‌ని.. ఒక సాధార‌ణ వ్య‌క్తిగా ఆయ‌న‌ను ట్రీట్ చేయ‌లేమ‌ని గ‌తంలో సీబీఐ చెప్పిన విష‌యాన్ని ఎందుకు మ‌రిచిపోతున్నార‌ని మేధావులు ఈ చ‌ర్చా వేదిక‌ల్లో పాల్గొంటున్న‌వారిని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, సీబీఐ దూకుడు విష‌యంలోనూ హైకోర్టు అనేక సందేహాలు వ్య‌క్తం చేసిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఇటీవ‌ల విచార‌ణ సంద‌ర్భంగా.. సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు వేసిన విష‌యాన్ని వారు చెబుతున్నారు.

A2 నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తున్నారని సీబీఐని హైకోర్టే ప్ర‌శ్నించింది క‌దా? దీనిని బ‌ట్టి అవినాష్‌రెడ్డి వైపు గుండుగుత్త‌గా త‌ప్పును రుద్దే ప్ర‌య‌త్నం చ‌ర్చావేదిక‌ల్లో పాల్గొంటున్న‌వారు ఎలా చేస్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ఎంపీ సీటు కోస‌మే.. ఇలా చేశార‌ని కొంద‌రు చెబుతుండ‌డంపైనా వారు అభ్యంతరం చేస్తున్నారు. స్వ‌యంగా హైకోర్టు సీబీఐని ఈ విష‌యంలో ప్ర‌శ్నించిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. “లోక్ సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు?” అని హైకోర్టు ప్ర‌శ్నించ‌లేదా? ఈ విష‌యాన్ని ఎందుకు విస్మ‌రిస్తున్నారు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్ మెంట్లు ఉన్నాయి కదా.. అని హైకోర్టు పేర్కొన్న విష‌యాన్ని, వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐకి హైకోర్టు ప్రశ్న వేసిన విష‌యాన్ని కొందరు తెర‌ మీదికి తెస్తున్నారు. అవినాష్ ఫోన్ స్వాదీనం చేయకుండా నిద్ర పోతున్నారా? చూస్తుంటే సీబీఐ అనుమానాస్పదంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది.. అని హైకోర్టే సంశ‌యం వ్య‌క్తం చేసిదని.. అయినా.. ఓ వ‌ర్గం మీడియాలో అవినాష్ ల‌క్ష్యంగా ఇలాంటి చ‌ర్చ‌లు పెట్టి.. ఏకంగా న్యాయ వ్య‌వ‌స్థ‌పైనే బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌మంజ‌స‌మేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మీకు అనుకూలంగా తీర్పులు.. ఆదేశాలు వ‌స్తే.. న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిఢ‌విల్లుతోంద‌ని.. మీకు అనుకూలంగా రాక‌పోతే.. న్యాయ‌వ్య‌వ‌స్థ అవినీతి మ‌యంగా మారింద‌ని అంటారా? అని నిల‌దీస్తున్నారు.