అందరికీ షాకిచ్చిన సుప్రీంకోర్టు!

Supreme Court
Supreme Court

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది.

తమ ముందుకు వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్లిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు (శుక్రవారం) పరిశీలించింది. ఈ సందర్భంగా సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయటం వెనుకున్న ఉద్దేశం తమకు తెలుసని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీని విచారణకు తాము నో చెబుతున్నట్లుగా పిటిషన్ దారు న్యాయవాది జయ సుకిన్ కు సుప్రీం బెంచ్ చెప్పింది.

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న వేళ.. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం ద్వారా లోక్ సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్ దారు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనను సుప్రీం పరిగణలోకి తీసుకోలేదు.

ఈ పరిణామం నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆదివారం కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అయితే.. ఈ కార్యక్రమానికి తాము హాజరు కామని 19ప్రతిపక్ష పార్టీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కానున్న విషయాన్ని వెల్లడించింది. మిగిలిన వారు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం.