ఏపీ ఉప ముఖ్యమంత్రిని అనూహ్య అనుభవం ఎదురైంది. సాధారణంగా ఈ స్థాయి నేత తమ ఊరికి వస్తున్నారంటే.. ఆ హడావుడి వేరే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊరంతా తాళాలు వేసుకొని బయటకు వెళ్లిపోయిన ఉదంతం బయటకు రావటంతో ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం వస్తున్న వేళ.. ఊరు వదిలి ఎందుకు వెళ్లాలి? ఆ అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గ్రామస్తుల తీరుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఓవైపు ప్రభుత్వ పథకాల లబ్థి పొందుతూనే.. మరోవైపు తాను ఊరికి వస్తున్న వేళలో.. తాళాలు పెట్టుకొని వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు. ఇంతకీ ఈ విచిత్రమైన ఊరు ఎక్కడుందన్న విషయంలోకి వెళితే.. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం విశేషం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే.
తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ ఊరుకు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు.. తమ ఇళ్లకు తాళాలు వేసేసి వేరే చోటుకు వెళ్లారు. మొత్తం పాతిక ఇళ్లు కూడా లేని ఈ గ్రామంలో ఇద్దరు.. ముగ్గురు తప్పించి.. మిగిలిన వారంతా తమ ఇళ్లకు తాళాలు వేసేసి వెళ్లిపోయారు. ఊరికి వెళితే తాళాలు కప్ప మాత్రమే కనిపిస్తాయన్న సమాచారాన్ని అందుకున్న డిప్యూటీ సీఎం ఆ ఊరి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇంతకూ ఆ ఊరి వారు ఎందుకంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే.. ఎక్కడ ప్రతీకార చర్యలు.. హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో హడలిపోయిన్త గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లేలా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నట్ల చెబుతున్నారు. తాజా పరిణామం గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిన వారి ఇళ్లల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాకు చెక్ పెట్టమన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలోఇప్పుడు వైరల్ గా మారింది.