ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా.. గెలుపు గుర్రం నాదే అనే భారీ అంచనాలు.. ఏ నాయకుడికైనా ఉండాల్సిందే. అలా ఉండడం కూడా తప్పుకాదు. అయితే.. దానినే నమ్ముకుని అలానే ఉండిపోతే.. అది సాకారం అవు తుందా? ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కదా.. అని నిర్లిప్తంగా ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు .. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో వినిపిస్తున్నాయి.
ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.. టీడీపీ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు. అయితే.. దీనికి కారణాలు వెతుక్కుని.. దానిని సరిచేసుకునే ప్రయత్నం మాత్రం ఆయన చేయడం లేదు. పైగా మద్యలో పార్టీ మారుతున్నట్టు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కుదిరితే జనసేనలోకి వెళ్తారంటూ.. ఇప్పటికీ బొండా అనుచరులు చెప్పుకొంటున్నారు.
ఇక, టీడీపీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు.. బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలకు.. బొండా ఎక్కడా పార్టిసిపేషన్ లేదు. ఏదో ఒకటి రెండు కార్యక్రమాలు చేసేసి.. మీడియా ముందుకు వచ్చి వైసీపీ సర్కారుపై విరుచుకుపడడం ద్వారా.. పరిస్థితి అంతా బాగుందనే ధోరణిలోనూ.. తనకు అనుకూలంగా ఉందని అనుకోవడంతోనూ ఆయన సరిపెడుతున్నారని.. టీడీపీలోనే ఓవర్గం చెబుతుండడం గమనార్హం.
పైగా ఎంపీతో విభేదాలు.. సమసిపోలేదు. ఇదిలావుంటే.. మరోవైపు వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటింటికీ తిరుగుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. సమస్యల పరిష్కారం కోసం.. ప్రయత్నించారు. దీంతో నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్యే రావడం లేదని.. చెప్పిన ప్రజలు.. ఎమ్మెల్యే వస్తున్నారనే టాక్ వినిపిస్తున్నారు. ఇది పరోక్షంగా బొండా ఉమాకు మైనస్ అవుతోంది. నా గెలుపు రాసిపెట్టుకోవచ్చన్న ఆయన ఇప్పుటికైనా తిరగకపోతే.. ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.