ఏపీకి మ‌ళ్లీ అప్పు.. నెలన్న‌ర‌లో 13,500 కోట్ల‌కు చేరిన రుణం!!

అప్పు చేసి ప‌ప్పు కూడు తిన‌రా.. ఓ న‌రుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వ‌ర్తిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం(2023-24) ప్రారంభ‌మై.. కేవ‌లం నెలన్న‌రే అయింది(ఏప్రిల్‌-మే15). అయితే.. ఈనెల‌న్న‌ర కాలంలో ఏపీ ప్ర‌భుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల రుణం తెచ్చింది.

ఇక‌, తాజాగా తెచ్చిన అప్పున‌కు వ‌డ్డీ ఠారెత్తి పోతోంది. రూ.వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.30 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. దీంతో ఇప్పటి వ‌ర‌కు ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్రం ఇచ్చిన‌ ఎఫ్‌ఆర్‌బీఎం ప‌రిమితిలో జగన్ ప్రభుత్వం రూ.13 వేల 500 కోట్లు అప్పు చేసిన‌ట్టు అయింది. ఇంకా మిగిలింది రూ. 17 వేల 500 కోట్లే… ఈ లోపు ఆర్ధికలోటు కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.

2014-2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఆర్ధికలోటు విడుదల చేయాలన్నా అవసరం లేదని కేంద్రం పిడివాదన వినిపించింది. తాజాగా రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేయడంతో అప్పుడు మాట్లాడిన బీజేపీ నేతలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.