అమరావతిలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నారు. దీంతో రైతులు, అమరావతి జేఏసీ నేతలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గొడవలు అవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి తామిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామంటే తాము అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు.

కొన్ని గ్రామాల పరిధిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం వేస్తున్న లే అవుట్ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. యంత్రాంగం పట్టాల పంపిణీకి వీలుగా భూమిని చదును చేస్తుంటే రైతులు ఆ భూమిని తవ్వేస్తున్నారు. సుప్రింకోర్టులో కేసు విషయం తేలేంత వరకు ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. యంత్రాంగం మొత్తం ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ పనులను తాము చేసుకుని వెళుతున్నారు.

దీంతో రైతులు, జేఏసీ నేతలు యంత్రాంగంపై మండిపోతున్నారు. పెట్రోలు, కిరోసిన్ నింపిన సీసాలను ఆందోళనకారులు అధికార యంత్రాగానికి చూపిస్తున్నారు. పనులు ఆపకపోతే తాము వీటిని ఉపయోగించాల్సొస్తుందని పదేపదే వార్నింగులిస్తున్నారు. తమ భూములను తమిష్టంలేకుండా ప్రభుత్వం ప్లాట్లుగా ఎలా మారస్తుందంటు అధికారులను రైతులు నిలదీస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఎలా పంపిణీ చేస్తుందంటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దొండపాడు గ్రామం ప్రాంతంలో లేఅవుట్లు వేయటానికి అధికారులు తీసుకొచ్చిన జేసీబీలను రైతులు అడ్డుకుని వెనక్కు పంపేశారు.

తమ విధులను అడ్డుకుంటున్నారనే కారణంతో కొందరు రైతులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. యంత్రాంగం చేసిన ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదుచేశారు. అధికారులను పెట్రోలు సీసాలతో బెదిరించినందుకు కూడా కేసులు బుక్ చేశారు. పట్టాల పంపిణీకి అధికారులు మొత్తం 25 లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు. నిడమర్రు, కృష్ణాయపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, మందడం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ప్రభుత్వం 50 వేల పట్టాల పంపిణీకి రెడీ అవుతోంది. అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోకి వచ్చే పేదలకు ఈనెల 18వ తేదీన పట్టాలను పంపిణీ చేయబోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.