టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. పవన్ సీఎం కేండేట్ అవుతారని ఎదురు చూసిన చాలా మంది జనసైనికులకు ఇది ఇబ్బందికర పరిణామమే అయినా, పోలింగ్ నాటికి సర్దుకుపోతారని ఆ మూడు పార్టీలు విశ్వస్తున్నాయి. ప్రస్తుతానికి ముగ్గురి మధ్య దూరం ఉన్నట్లే కనిపించినా త్వరలోనే అది చెరిగిపోతుందని నమ్ముతున్నారు..
జనసైనికుల కర్తవ్యమేంటి…
పొత్తు ప్రకటించే దాకా, ఆ తర్వాత జనసైనికుల కర్తవ్యమేమిటి.. పార్టీ శ్రేణులకు ఇదీ అర్థం కాని ప్రశ్న. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. కొన్ని చోట్ల టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన సైడైపోయినట్లేనని అర్థం చేసుకోకతప్పదు. ఆయా సీట్ల కోసం ఇంతవరకు ఆశలు పెట్టుకున్న జనసైనికుల రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరమైతే…మిగతా నియోజకవర్గాల పరిస్థితేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
చంద్రబాబు, లోకేష్ అభ్యర్థులను ప్రకటించిన దాదాపు పాతిక నియోజకవర్గాలు పోగా.. ఏయే నియోజకర్గాల్లో జనసేన పోటీ చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. ముందే మూడు పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించిస్తే పనిచేసుకోవడం ఈజీగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు లేవు.
రెచ్చగొట్టి.. ముందు పెట్టి..
జనసైనికులను వైసీపీ పైకి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న మాట. జనసేన కేడర్ కు ఆవేశం ఎక్కువ. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ను సీఎంగా చూసేందుకు వాళ్లు ఎవరితోనైనా ఫైట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ సంగతిని అర్థం చేసుకున్న టీడీపీ తమ గేమ్ ప్లాన్ అమలు చేయబోతున్నదని జిల్లాల్లో వినిపిస్తున్న మాట. జనసైనికులను ముందు పెట్టి తమ కేడర్ ను వెనుక నిలబెడితే.. జరిగే కథే వేరప్పా అని టీడీపీ నేతలు భావిస్తున్నారట. తన్నులు తినేది జనసేన కేడర్, పదవులు అనుభవించబోయేది టీడీపీ శ్రేణులన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..
నిధుల కొరత..
జనసేన వద్ద ఆవేశం ఉంది. అంకిత భావమూ ఉంది. కాకపోతే క్షేత్ర స్థాయిలో ఖర్చు చేసేందుకు మాత్రం పైసా లేదు. పనిచేసేందుకు సిద్ధమే , టీడీపీ వైపు నుంచి కొంచెం డబ్బులు వస్తే బావుంటుందని జనసేనికులు ఎదురు చూస్తున్నారు. అమ్మో నేను డబ్బులకు వ్యతిరేకమని చెప్పుకుంటూ తిరిగే పవన్ కల్యాణ్ ద్వారా చెప్పించుకోవడం కుదరని పని అని… అదేదో టీడీపీ వాళ్లే అర్థం చేసుకుంటే బావుంటుందని జనసేన నాయకులు భావిస్తున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates