అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశం ఇదే!

Supreme Court
Supreme Court

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డంపై.. తీవ్ర వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఆర్-5 జోన్‌‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఇటీవ‌ల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. అమ‌రావ‌తి వ్యాజ్యాల‌పై ఇచ్చే తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని సూచించింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ ఇళ్లు కేటాయించే ప‌నిని ముమ్మ‌రం చేసింది.

దీంతో రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీంకోర్టులో ఈ పిటిష‌న్ల‌పై విచారణ జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ కూడా.. రైతుల‌కు వెంట‌నే ఎలాంటి ఊర‌ట ల‌భించ‌లేదు. అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసును క‌లిపి వినాల‌ని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. దీనిపై రైతుల తరపున వాద‌న‌ సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహ‌త్గి, శ్యాం దివాన్, దేవ్ దత్ కామత్ వాదనలు వినిపించారు.

అయితే అమరావతి కేసుతో పాటు ఆర్‌-5 జోన్‌ కేసును కలిపి విచారణ జరపాలని నిర్ణయిస్తూ.. అమ‌రావ‌తి కేసును విచారిస్తు న్న జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు ఆర్-5 జోన్ పిటిష‌న్‌ను బ‌దిలీ చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. శుక్ర‌వారం లోగానే రెండు పిటీష‌న్ల‌పై విచార‌ణ‌కు జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు లిస్ట్ చేయాల‌ని రిజ‌స్ట్రీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆర్‌- 5 జోన్‌పై త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కూ స్టే ఇవ్వాల‌ని రైతుల తరపు న్యాయవాది హ‌రీశ్ సాల్వే సుప్రీంను కోరగా దీనికి సుప్రీం కోర్టు అంగీక‌రించ‌లేదు.

అమ‌రావ‌తి పిటిష‌న్ పెండింగ్‌లో ఉన్నందునే హైకోర్టు ఆర్- 5 జోన్ పై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది నిరంజ‌న్‌రెడ్డి ఉన్నత న్యాయ‌స్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ -5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను రైతులు కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు తెలిపారు.

కాగా.. ఆర్‌-5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను తాజాగా ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ల వ్య‌వ‌హారం మ‌రింత కాక‌రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.