ఏపీలో బ్రిటీషర్ల కాలం నుంచి సమస్యగా ఉన్నచుక్కల భూముల సమస్యకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. చుక్కల భూముల రైతులకు సర్వహక్కులు కల్పిస్తూ.. తాజాగా వారికి పట్టాలు అందించింది. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ చుక్కల భూముల రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ లోని 22(a) నుంచి చుక్కల భూములను తొలగించామన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ రూ.8 వేల కోట్లు, మార్కెట్ విలువ రూ 20 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. 97 ,412 వేల మంది రైతులకు 2లక్షల 6 వేల ఎకరాలకు హక్కులు కల్పిస్తున్నామన్నారు. బ్రిటిష్ హయాంలో రీసర్వే సెటిల్ మెంట్ రికార్డ్ లో చుక్కలు పెట్టి వదిలేశారని, దీంతో తర తరాలుగా రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 2016 లో గత టిడిపి ప్రభుత్వం రైతన్నలకు మేలు చేయకుండా పుండు మీదకారం చల్లినట్లు నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు.
చుక్కల భూముల సమస్యలపై ప్రజలు పడిన కష్టాలు తాను పాదయాత్రలో చూశానని సీఎం జగన్ చెప్పారు. కాళ్ళు అరిగేలా తిరిగినా.. జరగని ఈ చుక్కల భూముల సమస్యను ప్రత్యక్షంగా చూశానని, 43వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో., 37 వేల ఎకరాలు ప్రకాశంలో 22 వేల ఎకరాలు కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లా లలోని రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా రెండు లక్షలు ఎకరాల కు రైతులకు పూర్తి హక్కు కల్పిస్తున్నామని జగన్ చెప్పారు.
చుక్కల భూములు అంటే ఏంటి?
దాదాపు వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో(రీ సెటిల్మెంట్ రిజిస్టర్ – ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. వాటినే చుక్కల భూములుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వీటిపై హక్కులు కల్పిస్తూ.. ఏపీ ప్రషభుత్వం నిర్ణయించింది.