బీఆర్ఎస్‌కు ‘కుమార సంభ‌వం..’ సాధ్య‌మేనా?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అందివ‌చ్చిన పార్టీల‌తో క‌లిసి.. హ‌స్తిన‌లో అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికిగాను ప్ర‌ధానంగా.. క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ను త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా చేసుకుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. జేడీఎస్ కీల‌క నాయ‌కుడు.. కుమార‌స్వామిని అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్‌.

అలా.. అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న కుమార‌స్వామి.. ఇప్పుడు బీఆర్ఎస్‌ పై ప‌రోక్షంగా విరుచుకుపడ్డార‌నే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాదాన్యం సంత‌రించుకుంది. కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ఒక పార్టీ.. ముఖ్యంగా ఒక కీల‌క నాయ‌కుడు(పేరు చెప్ప‌లేదు) పార్టీకి ఆర్థికంగా.. భౌతికంగా(ప్ర‌చారం) కూడా సాయం చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని.. కానీ, ఆయ‌న హామీని నెర‌వేర్చ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంటే.. కుమార‌కు అండ‌గా ఉన్న‌ది ఎవ‌రు అంటే.. కేసీఆర్ మాత్ర‌మే.

ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ త‌ర‌ఫున కూడా ప్ర‌చారం చేస్తామ‌ని.. క‌ర్ణాట‌క ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజున బీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి కూడా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ నెల రోజులు సాగిన ప్ర‌చారంలో ఎక్క‌డా బీఆర్ఎస్ ఊసు క‌ర్ణాట‌కలో క‌నిపించ‌లేదు. పైగా.. కుమార‌స్వామికి.. ఎక్క‌డా ఆర్థికంగా కూడా సాయం అందలేద‌న్న‌ది.. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి తెలిసింది. ఈ నేప‌థ్యంలో రేపు హంగ్ వ‌చ్చి.. కుమార‌స్వామికి ప్రాధాన్యం పెరిగితే.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

త‌ద్వారా.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కుమార‌స్వామి ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మ‌రి అప్పుడు బీఆర్ఎస్‌కు ఆయ‌న ఏమేర‌కు సాయం చేస్తారు? ఎందుకు చేయాలి? అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. ఎందుకంటే.. రేపు హంగ్ వ‌స్తే.. బీజేపీ లేదా.. కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టే అవ‌కాశంఉంటుంది. ఇదే జ‌రిగితే.. బీఆర్ ఎస్‌కు పూర్తిగా కుమార దూరం ఖాయం. బ‌హుశ ఇది గ‌మ‌నించే కేసీఆర్ దూరంగా ఉన్నారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఎలా చూసుకున్నా.. బీఆర్ ఎస్‌లో కుమార‌సంభ‌వం.. సాధ్యం కాద‌నేవాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.