తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు పాతుకుపోయారు.ఎన్టీయార్ హయాం నుంచి చక్రం తిప్పుతున్న వాళ్లు ఇప్పుడు వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేదు. చంద్రబాబును కూడా పెద్దగా లెక్కచేయకుండా సొంత రాజకీయాలు, సొంత ప్రకటనలతో వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు కూడా అందులో ఒకరిగా చెప్పుకోవాలి. పార్టీలో తోచిన విధంగా ప్రవర్తిస్తూ, ఎవరినీ లెక్కచేయకుండా ప్రకటనలు చేస్తూ కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుంటారు.
ఉమ్మడి జిల్లాలో ప్రతీ ఒక్క టీడీపీ నేతతో అయ్యన్న పేచీలు పెట్టుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజులు కామ్ గా ఉండి మళ్లీ క్రియాశీలమైన గంటా శ్రీనివాసరావు పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు రుచించలేదు. ఐనా సీనియర్ కావడంతో ఏమీ అనలేక ఊరుకోవాల్సి వస్తోంది.
ఇప్పుడు రెండు అంశాల్లో అయ్యన్న పార్టీ పెద్దలను ఇబ్బంది పెడుతున్నట్లు భావిస్తున్నారు. తన కుమారుడు చింతకాయల విజయ్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ కావాలని కోరుతున్న అయన్న..ఏదైనా కారణం చేత అది కుదరకపోతే మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. దీని కోసం అధిష్టానంతోనూ, ఇతర నేతలతోనూ గొడవ పడేందుకు కూడా అయ్యన్న వెనుకాడబోరని ఆయన అనుచరులు చెబుతున్నారు..
గంటాతో పంచాయతీ చల్లారిన నేపథ్యంలో అయ్యన్న ఇప్పుడు బండారు సత్యనారాయణతో మడతపేచీ మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. టీడీపీలో రెండు టికెట్లు ఆశిస్తున్న బండారు.. తాను పెందుర్తి నుంచి పోటీ చేయడంతో పాటు కుమారుడు అప్పలనాయుడును మాడుగుల నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. పైగా స్థానికంగా అయ్యన్న పాత్రుడి కంటే బండారుకే బలమూ బలగమూ ఎక్కువగా ఉంది. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఆయకు పక్క బలం. దానితో మాడుగుల విషయంలో అమీ తుమీ తేల్చుకునేందుకు అయ్యన్న రెడీ అవుతున్నారట. అనకాపల్లి ఇస్తారా.. మాడుగుల ఇస్తారా త్వరగా తేల్చండి… మా విజయ్ ప్రచారం చేసుకోవాలని చంద్రబాబును నిలదీయబోతున్నారట. మరి పార్టీ అధినేత దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.