మూణ్నెళ్లుగా తీహార్ జైళ్లో ఉన్న కొడుకు.. మాగుంట ఆగ్రహం

దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నా ఎన్నడూ కేసుల్లో ఇరుక్కోని మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం దిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకు జైలుకెళ్లాల్సి వచ్చింది. శ్రీనివాసులరెడ్డికి జైలు తప్పినా కొడుకు మాగుంట రాఘవ మాత్రం మూణ్నెళ్లుగా జైలులోనే మగ్గాల్సివచ్చింది. అయితే, మూణ్నెళ్ల తరువాత కూడా ఆయనకు ఉపశమనం దొరక్కపోవడంతో మాగుంట కుటుంబం ఆలోచనలో పడింది. కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలే ఉన్న ఏపీ పాలక పార్టీ వైసీపీలో ఉన్నప్పటికీ తమను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు పార్టీ నుంచి సరైన సపోర్ట్ దొరకడం లేదని మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఫీలవుతున్నారట.

ముఖ్యంగా వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దిల్లీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నా తమ కోసం ఏ రోజూ ఆయన కేంద్రంతో మాట్లాడలేదని, ఇది పూర్తిగా తమను నిర్లక్ష్యం చేయడమేనని మాగుంట భావిస్తున్నారని ఆయన అనుచరవర్గం చెప్తోంది.

పైగా ఒంగోలు రాజకీయాల విషయంలోనూ తమను ఏమాత్రం సంప్రదించడం లేదని.. ఆదిమూలపు సురేశ్, వైవీ సుబ్బారెడ్డినే ఆయన అక్కడి నేతలుగా గుర్తిస్తున్నారని… లేదంటే, అలకబూనుతున్న బాలినేనిని బుజ్జగించడానికి ప్రాధాన్యమిస్తున్నారిన.. అంతేకానీ, ఒంగోలు ఎంపీగా ఉన్న తనను, తన సమస్యలను జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

తాను స్వయంగా ఒంగోలు ఎంపీగా నాలుగుసార్లు గెలిచినా, తన కుటుంబం ఆ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచినా కూడా జగన్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారట. కాగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ ఫిబ్రవరి 11 నుంచి తిహార్ జైళ్లో ఉన్నారు. తాజాగా సోమవారం కూడా దిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆయన బెయిల్ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన మరికొన్నాళ్లు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.

వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచి కుమారుడిని వైసీపీలో బరిలో దించాలన్న తన కోరికను గతంలో చాలాసార్లు జగన్ వద్ద చెప్పినా సానుకూలంగా స్పందించకపోగా.. ఇప్పుడు మొత్తం బాలినేని, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల చుట్టూనే అక్కడి అభ్యర్థిత్వాలు తిరుగుతుండడంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబాన్ని జగన్ పూర్తిగా పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారని.. రాజకీయంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు.