ఏపీలో క్ష‌త్రియులు ఎటువైపు..?

ఆర్థికంగా, పార్టీల ప‌రంగా.. రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌.. సామాజిక వ‌ర్గం క్ష‌త్రియులు. జ‌న‌సేన మిన‌హా..వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో వీరు మెండుగానే ఉన్నార‌ని చెప్పాలి. అయితే.. క్ష‌త్రియుల ఓటుబ్యాం కుపై కన్నేసిన జ‌గ‌న్‌.. తొలి మంత్రి వ‌ర్గం.. శ్రీరంగ‌నాథ‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే, మ‌లి విడ‌త‌లో మాత్రం ఈ వ‌ర్గాన్నిప‌క్క‌న పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ వ‌ర్గం వైసీపీవైపు ఉందా లేదా? అనేది సందేహంగా ఉంది. ఇది వైసీపీకీ కీల‌క స‌మ‌స్య‌గా మారింది.

మ‌రోవైపు.. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీల నుంచి పోటీ చేసినప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా మాత్రం వైసీపీకి క్ష‌త్రియులు ద‌న్నుగా నిలిచారు. అందుకే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో బ‌ల‌మైన క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం.. గుండుగుత్త‌గా వైసీపీకి ఓటేసింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితులు తారుమారు అవుతున్నాయ‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. ఈ సామాజిక వ‌ర్గం చూపు.. టీడీపీ వైపు ఉంద‌ని కొందరు చెబుతున్నారు. మ‌రికొంద‌రు బీజేపీతోనే ఉన్నార‌ని అంటున్నారు.

కానీ, న‌ర్మ‌గ‌ర్భంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌లు..చూస్తే.. క్ష‌త్రియ ఓటు బ్యాంకు రెండుగా చీలి .. కేంద్రంలో మోడీని బ‌ల‌ప‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది. మోడీ ఉంటే.. త‌మ‌కు అంతో ఇంతో మేలు అన్న‌ట్టుగా ఈ సామాజిక వ‌ర్గం నేత‌లు భావిస్తున్నారు. ఇక‌, ఏపీలోకి వ‌చ్చేస‌రికి జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో త‌మ పెట్టుబడులు దెబ్బ‌తిన్నాయ‌నేది మెజారిటీ క్ష‌త్రియుల వాద‌న‌. దీంతో ఇప్పుడు లోక‌ల్ పాలిటిక్స్‌కు వ‌చ్చే స‌రికి.. టీడీపీని బ‌ల‌ప‌రిచే ఉద్దేశంతో ఉన్నార‌ని స‌మాచారం.

ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిలో క్ష‌త్రియుల‌కు కూడా పాత్ర ఉంద‌ని.. కొన్ని పెట్టుబ‌డులు పెట్టార‌ని తెలుస్తోంది. ఇప్పుడు అమ‌రావ‌తిని లేకుండా చేయ‌డం అంటే.. త‌మ పెట్టుబ‌డులు పోయిన‌ట్టేన‌ని.. అదే చంద్ర‌బాబు వ‌స్తే.. తిరిగి అమ‌రావ‌తితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుంద‌ని చెబుతున్నారు. దీనిపై వారు నేరుగా బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. అయితే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని.. ఇది పెట్టుబ‌డులు.. జీవితాల‌కు సంబంధించిన స‌మ‌స్య అని.. క్ష‌త్రియ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో వీరి ఓటు ఎటువైపు అనేది ప్ర‌స్తుతానికికొంత క్లారిటీ ఉన్నా.. పూర్తిగా అయితే.. తేలడం లేదు. మ‌రి కొన్నాళ్లు ఆగాలేమో చూడాలి.