బీజేపీకి ఏం కావాలో అదే చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎక్కడైనా మతపరమైన ఇష్యూస్, హిందూ రిలేటెడ్ ఇష్యూస్ కోసం కాచుక్కూచుకునే బీజేపీ చేతికి అవే ఆయుధాలు అందిస్తున్నారు జగన్. ముఖ్యంగా ఏపీలో ఓ కొండ పేరు మార్చడం, ఓ గ్రామం పేర్చుతూ తాజాగా జీవో జారీ చేయడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో సీతమ్మ కొండపై వ్యూ పాయింట్ పేరును వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పేరు మార్చడంపై అక్కడి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నిరసన తెలుపుతుండగా.. తాజాగా రాష్ట్ర బీజేపీలోని మిగతా నేతలు సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ వంటివారు కూడా సీరియస్ అవుతున్నారు. ఆ వివాదం అలా ఉండగానే గుంటూరు ప్రాంతంలోని ఏటీ అగ్రహారం అనే ఊరు పేరును ఫాతిమా నగర్ అని పేరుయమార్చడంతో బీజేపీ నేతలు ఫైరవుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఓట్ల కోసం కుల, మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చి వైఎస్ఆర్ వ్యూ అని పేరు మార్పుపై ఇప్పటికే బీజేపీ పోరాటం చేస్తుందని ఆ ఘటన మరువకముందే గుంటూరులో ఏటి అగ్రహారం పేరు రాత్రికి రాత్రి తొలగించడంపై మండిపడ్డారు.
ఏటీ అగ్రహారం పేరు తొలగించింది ఫాతిమా నగర్ పేరుతో బోర్డులు పెట్టడం ఏంటని నిలదీశారు. ఏటీ అగ్రహారం పేరు వల్ల వైఎస్ జగన్‌కు కలిగిన ఇబ్బంది ఏంటి.. ఫాతిమా నగర్ అని మార్చడం వల్ల వచ్చే లాభం ఏంటని ప్రశ్నించారు. ఈ పేరు మార్పు వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అని నిలదీశారు. గుంటూరు కార్పొరేషన్ తీర్మానం చేసిందని పేర్లు మార్చేస్తారా అని మండిపడ్డారు. ప్రొద్దుటూరు కార్పొరేషన్ తీర్మానం చేసిందంటూ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేస్తారా అని నిలదీశారు.
ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి అని నిలదీశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం దారుణమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రాష్ట్రంలోని హిందువులు కనిపించడం లేదా అని నిలదీశారు. ఫాతిమా నగర్ పేరును తొలగించి ఏటీ అగ్రహారం పేరునే కొనసాగించాలని లేని పక్షంలో బీజేపీ పోరాటం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.
బీజేపీకే చెందిన మరో నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూ సమాజం ఏది ఉంచుకోదు.. తిరిగిచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి అని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇతర మతస్తులకు ప్రజాధనంతో ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ నిధులు మంజూరు చేసి, కావాల్సినంత స్వేచ్చ ఇస్తారు. ఇప్పుడు కొందరు ప్రభుత్వ అండతో కాలనీలకు కాలనీలననే మతం దురహంకారంతో పేర్లు మార్చేస్తున్నారు అని ఆరోపించారు.రాత్రికి రాత్రే గుంటూరులో ఏటి అగ్రహారం ఫాతిమాపురంగా ఎలా మారింది ? అని నిలదీశారు.
వ్యవహారం చూస్తుంటే బీజేపీ, వైసీపీ మధ్య ఇష్యూస్ మొదలైనట్లుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజల మూడ్ మారుతుండడం.. టీడీపీ వంటి పార్టీలు బీజేపీ విషయంలో పాజిటివ్‌గా మారడం వంటి కారణాలతో బీజేపీ కూడా వ్యూహం మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది.