మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగి సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఇంతకాలం మంత్రి ఆదిమూలపు సురేష్ వల్లే సమస్యలు వస్తున్నాయని భావించగా, ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న అక్కసు బాలినేనికి ఉందని తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా బయట పడింది.
వేర్వేరు శాఖల్లో తాను కోరుకున్న వారిని నియమించడం లేదని బాలినేని అలకపూనారు. సీఎం నివాసానికి బాలినేని వెళ్లినప్పుడు సమన్వయకర్తగా కొనసాగాలని జగన్ కోరితే.. అందుకు ప్రతిగా ప్రకాశం జిల్లాలో సుబ్బారెడ్డి జోక్యాన్ని ఆయన ప్రస్తావించారు. డీఎస్పీ నియామకాన్ని కూడా ఆయన జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
తాను సూచించిన హరినాథ్ రెడ్డిని కాదని సుబ్బారెడ్డి సూచించిన అశోక్ వర్థన్ ను నియమించడం పట్ల ఆయన అభ్యంతరం చెప్పారు. అయితే అందులో సుబ్బారెడ్డి ప్రమేయం లేదని సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి .. జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పైగా గతంలో విజిలెన్స్ పోస్టింగ్ కోసం అశోక్ వర్థన్ పేరును బాలినేని సిఫార్సు చేసినందునే ఆయనకు అభ్యంతరం ఉండదని భావించి నియమించారని ధనుంజయ్ రెడ్డి చెప్పారట. వెంటనే బాలినేని కోరిన వారిని ఒంగోలు డీఎస్పీగా నియమించాలని జగన్ ఆదేశించారట..
డీఎస్పీ వ్యవహారం చక్కబడినట్లే కనిపించినా… సమన్వయకర్త పదవిని తిరిగి తీసుకునేందుకు బాలినేని అంగీకరించలేదు. ఎందుకంటే సుబ్బారెడ్డి జోక్యం లేకుండా చూసుకుంటానని జగన్ చెప్పలేదు. ఆ పని చేయడానికి జగన్ కు చాలా చిక్కులే ఉన్నాయి..
Gulte Telugu Telugu Political and Movie News Updates