కర్ణాటక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కేవలం ఏపీ ప్రజలు వేసే ఓటుపైనే ఆధారపడ్డారు. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న బాగేపల్లిలో కన్నడ ప్రజలతోపాటు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. రాసేది కన్నడ భాషలో అయినా తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఏపీలోని చిలమత్తూరు, గోరంట్ల, కోడికొండ, పెనుగొండ, కదిరి, తాడిపత్రి, ధర్మవరం తదితర ప్రాంతాలనుంచి వలసవచ్చిన తెలుగు ప్రజలు ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుంటూ కన్నడిగులతో మమేకమయ్యారు.
బాగేపల్లి పట్ట జనాభా 2011 జనాబా లెక్కల ప్రకారం 25 వేల మంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలకు పైగానే ఉంది. ఇందులో సుమారు 20 శాతానికిపైగా ప్రజలు తెలుగువారే. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపోటములను తెలుగు ప్రజలు ప్రభావితం చేస్తుంటారు. ప్రస్తుతం విధానసభ ఎన్నికలు ఇక్కడ రసవత్తరంగా మారాయి. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు మొత్తం 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో బాగేపల్లి, గుడిబండ, చేళూరు తాలూకాలు ఉన్నాయి.
కాంగ్రెస్‌నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి, సీపీఎం తరఫున డాక్టర్ అనిల్‌కుమార్ బరిలో ఉన్నారు. జేడీఎస్ సీపీఎంకు మద్దతు ఇస్తోంది. బీజేపీ నుంచి మునిరాజ్ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే సుబ్బారెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున పార్టీ జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇండింపెండెంట్ అభ్యర్థి మిథున్‌రెడ్డి కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఎవరు గెలవాలన్నా.. ఏపీ ప్రజల ఓటు అత్యంత కీలకం కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates