నిన్న మొన్నటి వరకు బల్లగుద్ది మరీ.. ఈ నియోజకవర్గాలు మావే అని చెప్పుకొన్న వైసీపీ నాయకులకు ఇప్పుడు పెద్ద సంకటం వచ్చింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో కూసాలు కదిలిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గాలు , మరో 7 ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గతంలో కాంగ్రెస్ తర్వాత.. అదే రేంజ్‌లో దూసుకుపోయిన పార్టీ వైసీపీ. టీడీపీ కొన్ని స్థానాల్లో మాత్రమే బలోపేతం అయింది. బీసీ జపం కారణంగా.. టీడీపీ ఎస్సీలకు అటు ఇటుగా ఉందనే టాక్ ఉంది.
దీంతో గత ఎన్నికల్లో ఒక్క కొండపి(ఉమ్మడి ప్రకాశం) నియోజకవర్గం మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ ఎస్సీ నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది. ఇక, ఏడు ఎస్టీ స్తానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఈ 36 స్థానాల్లో ఒకటి రెండు మినహా.. అన్ని చోట్లా వైసీపీదే విజయం అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అదే నియోజకవర్గాల్లో పెద్ద కష్టం వచ్చింది. ఇదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీవ్ర అంతర్మథనంలోకి నెట్టేసింది.
కొన్నాళ్ల కిందట ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తేనెతుట్టెను వైసీపీ కదిలించింది. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లోకి, బోయ, వాల్మీకి.. తదితర కులాలను.. ఎస్టీల్లోకి చేరుస్తూ.. తీర్మానం చేయడం.. దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. ఇదే ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. నిజానికి.. ఎస్సీలు ఇప్పుడు తేడా వచ్చినా..ఎన్నికల సమయానికి ఏమైనా వారిని ఒప్పించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఎస్టీల విషయంలో మాత్రం ఇది కుదరదు.
వారు ఒక్కసారి మార్పు చెందితే.. ఇక, వారి ఓట్లు శాశ్వతంగా వైసీపీకి దూరమవుతాయి. ఇదే ఇప్పుడు వైసీపీలో నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. కనీసం.. ఈ తీర్మానం చేసే ముందు.. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో జగన్ చర్చించి ఉంటే బాగుండేదని. లేదా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆయన అంచనా వేసుకుని ఉన్నా బాగుండేదని.. ఎక్కువ మంది అభిప్రాయపడు తున్నారు. ఏదేమైనా.. ఇది ప్రభుత్వం వేసిన తొందరపాటు అడుగుగా పేర్కొంటున్నారు. ఇది.. పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.