కేసీఆర్ తన పార్టీ బీఆర్ఎస్‌ను విస్తరించడానికి ఇప్పుడు ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రం ఏపీ, మరో పొరుగు రాష్ట్రం కర్నాటకలోనూ కేసీఆర్ పార్టీ రాజకీయ ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఏపీలో విశాఖ కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ అంశంలో జోక్యం చేసుకుని కాస్త బజ్ క్రియేట్ చేశారు కూడా. కానీ… విశాఖ కంటే రాయలసీమ అయితే కేసీఆర్‌కు మరింత ఈజీ అవుతుందనే వాదన ఒకటి తాజాగా మొదలైంది. అందుకు కారణం.. తాజాగా రాయలసీమలో జరుగుతున్న పరిణామాలు.
ఏపీలో జగన్ పాలన నచ్చలేదన్నట్లుగా చాలామంది నేతలు ప్రత్యేక రాయలసీమ కావాలన్న తమ పాత డిమాండ్లు పైకి తెస్తుండగా.. జేసీ దివాకర్ రెడ్డి వంటివారు అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఆయనకు మద్దతిచ్చే నేతలూ కనిపిస్తున్నారు.
అయితే, ఉత్తరాంధ్రతో పోల్చితే రాజకీయ చైతన్యం అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల ప్రజలను ఆకట్టుకోవడానికి కేసీఆర్‌కు అనేక అంశాలు అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతోపాటు రాయలసీమకు తెలంగాణ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలు కూడా ఎక్కువే. హైదరాబాద్‌లోనూ రాయలసీమ వాసులు ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. చిన్నచిన్న హోటళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాల వరకు అన్నింటా రాయలసీమ ప్రజలు కనిపిస్తుంటారు.
రాయలసీమలో నీటి సమస్య, కరవు, భూములకు ధరలు లేకపోవడం వంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ కేసీఆర్ కనుక హామీ ఇవ్వగలిగితే రాయలసీమ యువత, కొన్ని వర్గాలను ఆయన ఆకట్టుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు.. తెలంగాణలో రాయలసీమ జిల్లాలను కలపాలని డిమాండ్ చేస్తున్న నేతల నుంచీ కేసీఆర్‌కు మద్దతు లభిస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా రాయలసీమ నుంచి సీఎం అయిన జగన్ సొంత జిల్లా సహా రాయలసీమకు ఏమీ చేయలేదని.. అదేసమయంలో పొరుగునే ఉన్న తెలంగాణ జిల్లాలు నీటితో కళకళలాడుతున్నాయని.. భూముల ధరలు పెరిగి ప్రతి కుటుంబం బాగుపడుతోందని.. ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని రాయలసీమ వాసులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రాయలసీమపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతల నుంచి కేసీఆర్‌కు సలహాలు వెళ్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates