నాలుగేళ్లకే నీరసించిపోయిన వైసీపీ నాయకుల్లో మేకపోతు గాంభీర్యం మాత్రం అలాగే ఉంది. అందుకే వైనాట్ 175 అంటూ సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. అయితే, ఇంటర్నల్ టాక్స్‌లో మాత్రం ఎక్కడెక్కడ ఓడిపోబోతున్నారనేది లెక్కలు వేసుకుంటున్నారట. ఆ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకుందట. వైసీపీ 0 పర్సంట్ హోప్‌తో ఉన్న నియోజకవర్గాలలో ఫస్ట్ పేరు పాతపట్నం అని చెప్తున్నారు. అద్భుతాలు జరిగితే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గెలుస్తావేమో కానీ పరమాద్భుతాలు జరిగినా కూడా పాతపట్నంలో గెలవలేమని వైసీపీ నేతలే చెప్తున్నారు. అందుకు కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు.
మిషన్ 175 నుంచి తప్పించిన మొట్టమొదటి నియోజకవర్గం పాతపట్నం. అందుకు కారణం అక్కడ ఆ పార్టీకి అభ్యర్థులు లేకపోవడం. ప్రస్తుతం పాతపట్నం నుంచి రెడ్డి శాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి ఆమె గెలిచారు. కానీ, ఆ తరువాత నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం మానేశారు. ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉండే ఆమె ఆంధ్రకు వచ్చినా కూడా విశాఖపట్నంలోనో లేదంటే తండ్రిగారి ఇల్లు పాలకొండలోనో ఉంటున్నారట. అంతేకానీ.. పాతపట్నం వచ్చి అక్కడ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను పలకరించడం అనేది అస్సలు చేసేవారు కారని చెప్తున్నారు. అయితే, నియోజకవర్గంలో తనపై విపరీతమైన వ్యతిరేకత రావడం, నాయకుల నుంచి తిరుగుబాట్లు మొదలుకావడంతో ఇటీవల కాలంలో ఆమె పాతపట్నం నియోజకవర్గంలో అడపాదడపా తిరుగుతున్నారు. కానీ.. ఇప్పటికే ఆలస్యమైపోయిందని, ఆమెకు టికెట్ ఇచ్చే ఉద్దేశం కూడా జగన్‌కు లేదని చెప్తున్నారు.
నిజానికి రెడ్డి శాంతికి, ఆమె కుటుంబానికి జగన్ చాలా ప్రాధాన్యతిచ్చారు. 2014లో ఆమెకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వగా ఓటమి పాలయ్యారు. 2019కి వచ్చేసరికి పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట రమణ మళ్లీ టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గం నుంచి రెడ్డి శాంతిని పోటీ చేయించారు. జగన్ వేవ్‌లో ఆమె గెలుపొందారు. అనంతరం రెడ్డి శాంతి సోదరుడు పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. అంతేకాదు.. విక్రాంత్ భార్య, విక్రాంత్ తల్లి కూడా జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. ఈ రకంగా ఇంటిల్లిపాదికీ జగన్ పదవులు ఇచ్చినట్లయింది.
2021 నవంబరులో రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ సందర్భంగా పాతపట్నం వచ్చారు జగన్. ఆ కార్యక్రమానికి వచ్చిన రెండు రోజులకే రెడ్డి శాంతి సోదరుడు విక్రాంత్‌ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు జగన్. ఇలా అమిత ప్రాధాన్యం ఇచ్చి జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నా రెడ్డి శాంతి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని.. ఆ కారణంగానే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు నాయకత్వం కూడా ఎదగలేదని.. ఇప్పుడు శాంతికి టికెట్ ఇవ్వకుంటే వేరే అభ్యర్థులు కూడా లేరని.. ఇలాంటి పరిస్థితిలో టీడీపీకి విజయం చాలా సులభమని అంచనా వేస్తున్నారు. అందుకే… వైసీపీ అంతర్గత చర్చలలో పాతపట్నాన్ని లెక్కల నుంచి తీసేశారట.