ఏపీలో పొత్తుల విషయంపై పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా ముందుకు సాగుతానని, ఎట్టి పరిస్థితి వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా పనిచేస్తానని కూడా పవన్ పలు సందర్భాల్లో వెల్లడించారు. దీంతో పవన్ .. పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారనే టాక్ జోరుగా వినిపించింది. ఇప్పటికే పవన్.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికలు ముగిసిన నాలుగు మాసాలకే ఆయన పొత్తు పెట్టుకున్నారు.
అయితే.. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. టీడీపీతో కలిసి ముందుకు సాగాలన్నది పవన్ వ్యూహంగా ఉంది. టీడీపీ కూడా ఇదే కోరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి ముందుకుసాగితే.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం తేలిక అవుతుందని భావిస్తున్నారు. అయితే.. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. కేవలం విజయవాడలోని ఓహోటల్‌లోను.. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలోనూ పవన్ భేటీ అయ్యారు.
అంతకుమించి.. పవన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే.. దీనికి కారణం.. ఏంటి? ఎవరు? అనే చర్చజోరుగా సాగుతోంది. తాజాగా టీడీపీ నేత,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టీడీపీతో కలవడానికి వస్తుంటే బీజేపీ ఆయనకు అడ్డుపడుతోందని అన్నారు. రాష్ట్రానికి అసలు బీజేపీ అవసరమా అని ప్రజలు ప్రశ్నించేరోజు దగ్గర్లో ఉందన్నారు.
అధికార వైసీపీ పార్టీకి తెరవెనుక కొమ్ముకాస్తుందో లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుందో బీజేపీ నాయకులు తేల్చి చెప్పాలన్నారు. తప్పులు చేసి తరచూ ఢిల్లీకి వెళ్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా వ్యవ హరిస్తున్న కేంద్ర పెద్దలు.. రాష్ట్ర బాగు కోసం శ్రమిస్తున్న పవన్‌కల్యాణ్‌ను ఎందుకు ప్రోత్సహించలేక పోతున్నారో సమాధానం చెప్పాలని కోరారు. మొత్తానికి పవన్ ఎందుకు దూకుడుగా లేరనే విషయంపై మాత్రం ఇప్పుడు క్లారిటీ రావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates