సెప్టెంబ‌రు నుంచి విశాఖ‌లోనే కాపురం: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌రు నుంచి తాను విశాఖ‌లోనే కాపురం పెట్ట‌బోతున్నా నని చెప్పారు. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు” అని జగన్‌ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే తాను ప‌రిపాల‌న చేస్తాన‌ని చెప్పారు. అక్క‌డే కాపురం ఉంటాన‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మూల‌పేట‌లో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని సీఎం చెప్పారు.

ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. టీడీపీ కొంద‌రితో క‌లిసి త‌న‌పై యుద్ధం చేస్తోంద‌ని తెలిపారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విశాఖ నుంచే పాల‌న సాగిస్తాన‌ని చెప్పారు. భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయన్నారు.

ఒక అబ‌ద్ధాన్ని ప‌దే ప‌దే చెబుతున్నార‌ని, వాళ్ల‌లా త‌న‌కు అబ‌ద్ధాలు చెప్పే అల‌వాటు లేద‌ని సీఎం చెప్పారు. తోడేళ్ల‌న్నీ ఏక‌మైనా త‌న‌కు భ‌యం లేద‌ని వ్యాఖ్యానించారు. “మీ ఇంట్లో మంచి జ‌రిగి ఉంటే.. మీ బిడ్డ‌గా న‌న్ను ఆశీర్వ‌దించండి. మీ బిడ్డ‌కు మీరే సైనికులుగా నిల‌వండి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన న‌గ‌రం విశాఖేన‌ని చెప్పారు.