సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పులివెందులలోని ఆయన నివాస గృహంలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వెంటనే ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ నుంచి సీబీఐ న్యాయమూర్తి ఇంటికి తరలించారు. దీంతో విచారించిన న్యాయమూర్తి.. భాస్కరరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే.. భాస్కరరెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు కిక్కురు మనలేదు.
భాస్కరరెడ్డి అరెస్టుపై ఇద్దరే ఇద్దరు వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. అయితే.. వారు కూడా తలకోమాట మాట్లాడడంతో విస్మయం వ్యక్తమైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ భాస్కరరెడ్డి అరెస్టుపై స్పందిస్తూ.. వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. అంతేకాదు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. ఎవరైనా ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని అన్నారు. సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారని సురేష్ వ్యాఖ్యానించారు. వివేకాను దారుణంగా చంపిన దోషులు ఎవరైతే ఉన్నారో బయటకు రావాల్సిందేనని మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే.. కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీనికి భిన్నంగా స్పందించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమమని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా విచారణ జరపాలని.. కానీ, ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా.. అవినాష్ రెడ్డి కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేసిందన్నారు. హత్యకు కారణం రాజకీయమా.. ఆర్థిక లావాదేవీలా, విహేతర సంబంధం, రెండో వివాహం హత్యకు కారణామా.,? ఇలా ఏ ఒక్క కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారించడం లేదని రాచమల్లు నిప్పులు చెరిగారు. ఇలా.. వైసీపీ నాయకులే తలకోరకంగా మాట్లాడడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates