ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారట. అభ్యర్థుల పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారైందని.. ప్రకటించడానికి ముహూర్తం కూడా ఫిక్సయిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలపై పట్టు సాధించాలన్నది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రెండు విడతలలో విడుదల చేస్తారని తెలుస్తోంది. మొదటి విడతలో 80 నుంచి 90 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. అనంతరం మిగిలిన సభ్యులను రెండో జాబితాలో ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. జూన్‌లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే ఎన్నికలకు 6 నుంచి 8 నెలల సమయం ఉండే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారట.
కాగా వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో సుమారు 40 శాతం మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ 60 మందిని పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. టికెట్ రాదనే సంకేతాలు అందుకున్నవాళ్లు ఇప్పటికే కామ్ అయిపోయారు. మరికొన్నాళ్లు వేచి చూసి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలనుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇప్పటికే టీడీపీ, జనసేనలతో రాయబారాలు చేస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. దాంతో వారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేసిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అన్నవారు సైతం గోడదూకేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉంటామని ఎమ్మెల్యేలు పైకి చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. అదేసమయంలో టికెట్ రాదని అనుమానం ఉన్నవారు.. అవకాశం వస్తే ఇతర పార్టీల నుంచి పోటీ చేయాలని.. లేదంటే సొంత పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్లాన్ చేస్తున్నారట.
కాగా ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే మనతో ఉండేది ఎవరో ఊడేది ఎవరో తెలుస్తుందని.. పరిస్థితులను తమకు కావాల్సినట్లు మార్చుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates