తెలంగాణలో మూడు రోజుల్లో మోదీ పర్యటన ఉందనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని జైళ్లో పడేసి సవాల్ విసిరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చూడ్డానికి ఇది పోలీసులు, కోర్టుల వ్యవహారంలా కనిపించినా పూర్తిగా రాజకీయ వ్యవహారమే. దేశ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి రూ. 11 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండడం.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న సమయంలో ఆయన పార్టీకి చెందని రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడ లేకుండా చేయడానికి జైళ్లో వేయడంతో నేరుగా మోదీకే కేసీఆర్ సవాల్ విసిరినట్లయింది. దీంతో మోదీ స్వయంగా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో మోదీకే నేరుగా సవాల్ విసిరిన కేసీఆర్ వ్యూహమేంటి? ఆయన ధైర్యమేంటి అనేదీ చర్చకొస్తోంది.
నిజానికి మోదీ హాజరయ్యే సభ కోసం సంజయ్ నాయకత్వంలో బీజపీ తెలంగాణ శాఖ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జనసమీకరణకు కూడా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, విద్యాసాగరరావు వంటి సీనియర్లు ఉన్నా కూడా సభలు విజయవంతం చేయడం, జనాలను సమీకరించడంలో మాత్రం సంజయ్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే బీజేపీ సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు పాల్గొంటున్న ఈ సభ సమయలో సంజయ్ లేకపోవడం లోటుగానే చెప్పాలి.
మరోవైపు తన పర్యటనకు మూడు రోజుల ముందు… పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు సంజయ్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై మోదీ కూడా మండిపడుతున్నారని సమాచారం. ప్రధాని పర్యటనలో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిని లేకుండా చేయడం తనకే సవాల్ విసరడంగా ఆయన భావిస్తున్నారని చెప్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌కు బదులు తీర్చుకుంటేనే పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందని.. లేదంటే శ్రేణులు చప్పబడతాయని స్థానియ నాయకులూ అంటున్నారు. దీంతో మోదీ, అమిత్ షా, నడ్డాలే స్వయంగా రంగంలోకి దిగుతారని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నేతలను బీజేపీ పెద్దలు టార్గెట్ చేయడం గ్యారంటీ అంటున్నారు.
కాగా లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో ఇప్పటికే దానిపై స్పీకరుకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. లోక్ సభ రూల్ 229 ప్రకారం ఎంపీని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకరుకు నోటీసు ఇవ్వాలి. కానీ, సంజయ్ విషయంలో అలా చేయలేదు తెలంగా ణ పోలీసులు. దీంతో ప్రివిలైజ్ కమిటీ దృష్టికి ఇది తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకరును బీజేపీ ఎంపీలు కోరారు. స్పీకర్ వైపు నుంచి కూడా దీనిపై స్పందన ఉండబోతున్నట్లు సమాచారం.