దీని వెనుక పెద్ద ప్లానే వుంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిల్లీలో పాగా వేశారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన దిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో ఈ రోజు చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన జేపీ నడ్డాను ఈ రోజు కలిసి ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ తరువాత రాష్ట్రం విడిపోవడంతో జైసమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశారు. అయితే… ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీని ఆదరించలేదు. సీట్లు గెలుచుకోకపోవడమే కాకుండా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరిన ఆయన అక్కడ కూడా ఏమీ యాక్టివ్‌గా లేరు. కిరణ్ కుమార్ రెడ్డి టెక్నికల్‌గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా వాస్తవంగా అయితే ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉండడం కానీ చేయ లేదు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ దృష్టి ఆయనపై పడిందని.. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆ ప్రకారమే కిరణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని.. కాస్త సమయం తీసుకుని బీజేపీలో చేరుతున్నారని చెప్తున్నారు. కాగా కిరణ్‌ను బీజేపీ తెలంగాణలో ప్రయోగించనుందనే ఒక వాదన వినిపిస్తోంది.

అదే సమయంలో బీజేపీలో ప్రాధాన్యమున్న పదవి అప్పగించి ఆయన్ను ఏపీలో యాక్టివ్ చేయాలని బీజేపీ అనుకుంటోందని.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు అనుయాయులుగా ఉన్న కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యత కిరణ్ తీసుకుంటారని.. రాయలసీమకు చెందిన ఓ సీనియర్ దళిత నేత కూడా కిరణ్ అడుగుజాడలలో నడుస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చని చెప్తున్నారు.

క్రియాశీల రాజకీయాలకు, తన సొంత ప్రాంతానికి దూరమైన కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ ఎలా ఉపయోగించుకోనుంది.. ఆయన ఎలా ఆ పార్టీకి ఉపయోగపడతారనేది చూడాలి.