వైసీపీకి కౌంట‌ర్‌.. ‘జగనే మన దరిద్రం’ : చంద్ర‌బాబు దిశానిర్దేశం

త్వ‌ర‌లోనే తాను ఉత్త‌రాంధ్ర‌లో 25 రోజుల పాటు ప‌ర్య‌టిస్తాన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. అదేస‌మ‌యంలో పార్టీ ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌కు.. కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు టైం లేదంటే.. కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. తాను చెబుతున్న విష‌యాల‌ను నోట్ చేసుకుని వాటిపై యుద్ధం చేయాల‌ని.. ప్ర‌జ‌లు ఎందుకు చేరువ కారో.. నాయ‌కులు ఎందుకు ఎలివేట్ కారో నేను చూస్తాన‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో పార్టీ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు కొన్ని ఆయుధాలు అప్ప‌గించారు.

— ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. కానీ లేటరైట్‌ పేరు చెప్పి, పోలీసు సెక్యూరిటీతో లారీలకు లారీలు తీసుకుపోతున్నారు. ఇదంతా భారతీ సిమెంట్‌ ఖాతాలోకి వెళ్తోంది. దీనిపై పోరాటం చేయండి.

— రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోంది. నాసిరకం బ్రాండ్లు తెచ్చి పేదప్రజలను దోచుకుంటున్నారు. మద్యం దుకాణాల్లో బిల్లులు ఇవ్వరు. ఆ ఆదాయమంతా తాడేపల్లికి వెళ్తోంది. మద్య నిషేధం గురించి ప్రశ్నించండి. నాసిర‌కం మ‌ద్యంపై పురుషుల‌తో క‌లిసి పోరాటాలు చేయండి.

— విశాఖ విమానాశ్రయంలోనే కోడికత్తి డ్రామా ఆడారు. రేపు ఇంకో కొత్త డ్రామాకు తెర తీస్తారు. బాబాయిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అన్నారు. జగనాసుర రక్తచరిత్ర రాసి దానిని నారాసుర చరిత్రగా నమ్మించాలని చూశారు. తమ్ముడిని రక్షించుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాలి. వీటిపై ముందు పార్టీ నాయ‌కులు అవ‌గాహ‌న చేసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి అని చంద్ర‌బాబు సూచించారు.

— ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల అవినీతి జరిగింది. అనేక మందిని భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు. కార్తీకవనం, ప్రేమసమాజం, దసపల్లా, హయగ్రీవ భూములు.. ఇలాగే చేతులు మారిపోయాయి. వీటిని బ‌లంగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టండి. అవ‌స‌ర‌మైతే.. ఇంటింటికీ తిరిగి.. వివ‌రించండి.

— ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉంది. ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. తాజాగా యూనిట్‌కు 40పైసలు భారం వేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నారు. చెత్తపన్ను కూడా ఆరునెలలకోసారి ఆస్తిపన్నులో కలిపి వసూలు చేయాలని నిర్ణయించారు. వీటిని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. దీనిని మ‌న‌కు అనుకూలంగా మార్చి.. మీరు పుంజుకునేలా వ్య‌వ‌హ‌రించాలి.

— ‘జగనే మా భవిష్యత్తు’ అంటూ వైసీపీ నేత‌లు కొత్త కార్యక్రమానికి తెర తీశారు. దానిపై ‘జగనే మన దరిద్రం’ అంటూ మనం ప్రజల్లోకి వెళ్లాలి. ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాలి.

— మంత్రి గుడివాడ అమర్నాథ్‌ టీడీపీ కార్పొరేటర్‌గా ఉండి, ఇప్పుడు పెద్దనాయకుడిలా ఫోజులు కొడుతూ కోడిగుడ్డు నీతులు చెబుతున్నారు. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి, జాబు కావాలి…బాబూ రావాలి అని నినదించాలి. అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.