ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

నెల్లూరు జిల్లా రూర‌ల్ ఎమ్మెల్యే.. వైసీపీ రెబ‌ల్ నాయ‌కుడు.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిని గురువారం తెల్ల‌వారు జామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్ల‌వారు జామున 4 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇంటికి చేరుకున్న సుమారు 50 మంది పోలీసులు.. ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రారాద‌ని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ విష‌యం ఉద‌యం 6 గంట‌ల‌కు కానీ,… బ‌య‌ట‌కు రాలేదు.

దీంతో విష‌యం తెలిసిన వెంట‌నే ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిమానులు,కార్యకర్తలు భారీ సంఖ్య‌లో ఇంటికి చేరుకున్నారు. కోటంరెడ్డికి అనుకూలంగా ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకు త‌న‌ను నిర్బంధించారో.. చెప్పాల‌ని కోటంరెడ్డి ప్ర‌శ్నించారు. అయితే.. పోలీసులు మాత్రం ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు.. తాము నోటీసులు ఇచ్చామ‌ని పేర్కొన్నారు.

ఇదీ.. విష‌యం

నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం గ‌త కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు దీనిపై ఆయ‌న స్థానిక ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీంతో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిరసన తెల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో గురువారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్ష చెట్టెందుకు సిద్దమ‌య్యారు.

అయితే.. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు.. కోటంరెడ్డి దీక్షకు అనుమతి లేదని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే కోటంరెడ్డి దీక్ష చేపట్ట కుండా తెల్లవారుజామున ఆయనను హౌస్ అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేరు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటి వద్ద పోలీసులు, కార్యకర్తలు భారీగా మోహ‌రించారు.