గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద సమావేశం జరిగింది. దీనికి ఆత్మీయసభ అని పేరుపెట్టినా ఇది ముమ్మాటికీ మంత్రికి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశమే అని అర్ధమైపోతోంది. సీనియర్ నేత, మంత్రికి బద్ధవిరోధి అయిన చిట్టా విజయభాస్కరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గంలోని చాలామంది హాజరయ్యారు.
చిట్టా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇంతమంది హాజరయ్యారంటేనే అంబటిపైన పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది. నిజానికి అంబటిది రేపల్లె నియోజకవర్గం. అయితే పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పోటీచేయించారు. ప్రత్యేక పరిస్ధితుల్లో పార్టీలోని నేతలు, క్యాడరంతా కష్టపడి పనిచేస్తే అంబటి గెలిచారు. గెలిచిన దగ్గర నుండి నేతలతో తేడాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతునే ఉన్నాయి. అక్కడక్కడ అసమ్మతి వినిపిస్తున్నా తాజా సమావేశం మాత్రం కీలకమనే చెప్పాలి.
ఇక్కడ గమనించాల్సిందేమంటే అంబటికి టికెట్ ఇస్తే సత్తెనపల్లిలో ఓడిస్తామని డైరెక్టుగా జగన్నే హెచ్చరించటం గమనార్హం. లోకల్ అయిన తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని చిట్టా డైరెక్టుగానే చెప్పేశారు. దానికి చాలామంది మద్దతుగా నిలబడ్డారు. సో, జరిగింది చూస్తుంటే జగన్ చేయించుకున్న సర్వేల్లో అంబటిపైన సత్తెనపల్లిలో వ్యతిరేకత బయటపడే ఉంటుందనటంలో సందేహంలేదు. పార్టీలో ఇంత వ్యతిరేకత ఉన్నపుడు అంబటికి మళ్ళీ జగన్ టికెట్ ఇస్తారా ?
లేకపోతే జనాల్లో బాగానే ఉంది కాబట్టి పార్టీలో అసమ్మతిని లెక్కచేయాల్సిన అవసరంలేదని అనుకుంటారా ? అన్నది పజిల్ అయిపోయింది. పార్టీ నేతలు, క్యాడర్ పనిచేయకపోతే అభ్యర్ధి గెలవటం చాలా కష్టం. అభ్యర్ధికి అనుకూలంగా పనిచేయకుండా ఎవరు ఊరికే కూర్చోరు. ప్రత్యర్ధి గెలుపుకు కచ్చితంగా సాయంచేస్తారు. మరిపుడు అంబటికి కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి అంబటికి టికెట్ దక్కేది అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది. మరి సొంత నియోజకవర్గం రేపల్లెకే వెళతారా ? లేకపోతే అసలు పోటీనుండి తప్పించి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా అన్నది చూడాలి.