జగన్‌తో గేమ్స్ ఆడుతున్నారా?

ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకాలం జగన్‌కు వ్యతిరేకంగా ఆలోచించడానికే భయపడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్‌నే బెదిరిస్తున్నారని.. తమకు టికెట్లు రాకపోతే రెబల్స్‌గా వేస్తామని.. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలవనివ్వకుండా చేస్తామని.. అవసరమైతే టీడీపీలో చేరుతామని ఓపెన్‌గా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

మరికొందరైతే టీడీపీతో తాము టచ్‌లో ఉన్నట్లు.. టీడీపీ నేతల నుంచి తమకు కాల్స్ వచ్చినట్లు ఫీలర్లు ఇస్తూ జగన్‌ను డిఫెన్సులోకి నెట్టే గేమ్ మొదలుపెట్టారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వైసీపీ పెద్దల సూచనల మేరకు కొందరు టీడీపీ తమను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఏమీ లేకుండానే తమకు కూడా టీడీపీ నుంచి కాల్స్ వచ్చినట్లు… తమని ఆ పార్టీలోకి పిలుస్తున్నట్లు లీకులిస్తున్నారట.

టీడీపీ వేవ్ కనిపిస్తుండడంతో జగన్ ఒత్తిడిలో ఉన్నారని, ఇంకా చెప్పాలంటే ఓటమి భయంతో ఉన్నారని.. ఆయనపై ఒత్తిడి పెంచడానికి, టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తూ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు, తమకు టీడీపీ సహా ఇతర పార్టీలలో అవకాశాలున్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారన్న ఓ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఇదే స్ట్రాటజీతో పదవి దక్కించుకుంటున్నారని వైసీపీలో అనుకుంటున్నారు.

తాము కూడా ఇదే ఫార్ములా అవలంబించాలని.. లేదంటే టికెట్ గ్యారంటీ ఉండదని.. వచ్చే ఎన్నికలకు వైసీపీ టికెట్ల వ్యవహారం దాదాపు వేలంపాట తరహాలో మారిపోబోతోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అందుకే… పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచడానికి టీడీపీ పేరు వాడుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ వాస్తవంగా కూడా కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతోందని.. వారి గెలుపు అవకాశాలు, పార్టీకి పనికొస్తారా లేదా అనే చెక్ చేసి తీసుకోవాలనుకుంటున్నారని టాక్.