టీంను మార్చి.. జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ట‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒక ప్ర‌త్యేకత ఉంది. తాను ఏం చేసినా.. చాలా క‌రెక్ట్ అనుకుంటారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కూట‌మిలో ఎవ‌రు ఏం చేసినా.. ఆయ‌న త‌ప్పులు వెతుకుతారు. అంతేకాదు.. వారంతా త‌ప్పులే చేస్తున్నార‌ని కూడా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు త‌ప్పులు అన్నీ కూడా.. ఆయ‌న చుట్టూనే తిరుగుతు న్నాయ‌ని గ్ర‌హించార‌ట‌. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న త‌ప్పులు చేస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్షాలు మొత్తుకున్నాయి.

అభివృద్ధి నిలిచిపోయింది. కీలక‌మైన రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టారు. పోల‌వ‌రం పూర్తి చేయ‌డం లేదు. ఇలా.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. వాటిని గాలికి వ‌దిలేసి.. కేవ‌లం పంచ‌డం వ‌రకే.. బ‌ట‌న్ నొక్క‌డం వ‌ర‌కే త‌ను ప‌రిమిత‌మ‌ని భావించారు. అయితే.. ఇది రివ‌ర్స్ అయింది. ప్ర‌జ‌ల్లో సానుభూతి పెర‌గ‌క‌పోగా.. తాము క‌ట్టిన ప‌న్నుల‌తో వేల కోట్ల రూపాయ‌ల‌ను పందేరం చేయ‌డం ప‌ట్ల మెజారిటీ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌తో ఉన్నారు.

ఈ ప‌రిస్థితే ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్‌.. మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌స‌మ‌యంలో ఆయ‌న భారీ అంచ‌నాల‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అనుకున్న విధంగా మంత్రులు మాత్రం పుంజుకోలేక పోతున్నార‌నేది.. ఇప్పుడు జ‌గ‌న్ క‌నిపెట్టిన మ‌రోపెద్ద త‌ప్పిదం.

ఇలా త‌ప్పుల‌పై త‌ప్పులు.. చేసుకుంటూ వెళ్తున్న ఆయ‌న మ‌ధ్య‌లో టీంను మార్చ‌డం ద్వారా.. మ‌రో ప్ర‌ధాన త‌ప్పు చేసిన‌ట్టు బాధ‌ప‌డుతున్నారు. సాయిరెడ్డిని త‌ప్పించిపూర్తి బాధ్య‌త‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి అప్ప‌గించారు. ఇది పార్టీని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళ్తోంది. ఏ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.