తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో రెండు అంశాలపై ఈ విమర్శలు-ప్రతి విమర్శల పరంపర కొనసాగుతోంది.
తెలంగాణలో కరోనా కలకలం ఒకటి కాగా, ప్రస్తుత సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించడం ఇంకో విషయం. అయితే, రెండో విషయంలో ఇన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్పై విరుచుకుపడుతున్న బీజేపీ సరిగ్గా అలాంటి చాన్సే గులాబీ దళపతి టీంకు అందించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘సెంట్రల్ విస్టా రెనోవేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టు అవశ్యకతను సవాలు చేస్తూ నిఖిల్ సూరి అనే లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.
ప్రస్తుత పార్లమెంటు భవనం పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని అందులో పేర్కొన్నది. 100 ఏళ్లు పైబడిన ఈ భవనంలో సాంకేతిక సమస్యలతో పాటు భద్రతాపరంగా లోపాలున్నాయని తెలిపింది. పార్లమెంటు భవనం అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని, అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని పేర్కొంది.
కాగా, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం సచివాలయం విషయంలో ఇదే వాదన వినిపిస్తోంది. సచివాలయంలో ఇప్పుడున్న భవనాలు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టినవి. ఒకటి పాతదైందని కూల్చి కొత్తది కట్టేసరికి మరొకటి పాతది అవుతోంది.
ఈ అతుకుల బొంత సంసారం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొంటూ… ఎప్పటికైనా కొత్త సచివాలయం కట్టుకోక తప్పదు కాబట్టి ఇప్పుడు మొదలు పెడుతున్నట్లు చెప్తోంది. తాజాగా, కేంద్రం పార్లమెంటు భవనం విషయంలో ముందుకు సాగుతున్న తీరును ప్రస్తావిస్తూ ఒకింత దూకుడుగానే స్పందించనున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates