గెల‌వక పోతే.. రాజ‌కీయాలు వ‌దిలేస్తా

నెల్లూరులో వైసీపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. వైసీపీ కీల‌క ఎమ్మెల్యేలు.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిల‌పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో వారంతా ఖండించారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని ఎలా నిర్ధారించార‌ని ఆనం ప్ర‌శ్నించారు.

ఇక‌, కోటంరెడ్డి..త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి.. మంచి ప‌నిచేశార‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా నేత‌ల నోటి నుంచి పొలిటిక‌ల్ తూటాలు పేలుతున్నాయి. ఇంత‌లోనే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఈ ముగ్గురిపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు గెలిచి రండి చూద్దాం” అని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్‌పై స్పందించిన ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. ప్ర‌తిస‌వాల్ రువ్వారు.

“నేను గెల‌వ‌క‌పోతే.. రాజ‌కీయాలు వ‌దిలేస్తా. నువ్వు గెల‌వ‌క‌పోతే ఏం చేస్తావ్‌?” అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్‌ను నిల‌దీశారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని హెచ్చరించారు. పెద్దపెద్ద వాళ్లని తానూ తరిమినోడినేనని.. కేవలం అనిల్‌కు నోరుందనే మంత్రి పదవి ఇచ్చారన్నారు. అంతేకాదు.. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనిల్ గెలుస్తాడని అనే వారే లేరని మేకపాటి ఎద్దేవా చేశారు.

తాను 4 సార్లు ఎమ్మెల్యేనని.. గత ఎన్నికల్లో 35 వేలు మెజార్టీ తెచ్చుకున్నానన్నారు. సింగిల్ డిజిట్‌తో గెలిచినోడివి అంటూ అనిల్‌కు చురకలు అంటించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానని.. రామనారాయణరెడ్డి నూటికి నూరు శాతం, కోటంరెడ్డి నూటొక్క శాతం గెలుస్తారని స్పష్టం చేశారు. అనిల్‌కి అస్సలు టిక్కెట్టే ఇవ్వరంటున్నారని ముందు అది చూసుకోవాలంటూ సూచనలు చేశారు. “నేను గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తా… నువ్వు గెలవకుంటే రాజకీయాలు వదిలేస్తావా?” అని మేకపాటి స‌వాల్ రువ్వారు. మ‌రి దీనిపై అనిల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.