తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి చాలా రోజులైంది. పార్టీ విస్తరణపై వరుస ప్రకటనలు చేసి కూడా చాలా రోజులైంది. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి జనం వచ్చి చేరి కూడా నెలలు గడిచాయి. ఇప్పుడు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అక్కడి నాందేడ్ లో రెండో సారి బహిరంగ సభను నిర్వహించారు. మహారాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్ల పోటీ చేస్తుందని ప్రకటించడం ద్వారా అక్కడి కార్యకర్తల్లో కేసీఆర్ జోష్ నింపారు.
మహారాష్ట్ర మాట ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదలిక లేదన్న టాక్ నడుస్తోంది. తొలుత హడావుడిగా కొందరు వచ్చి చేరారు. తోట చంద్రశేఖర్ ను ఏపీ శాఖాధ్యక్షుడిగా నియమించారు. అమరావతే రాజధాని అని కూడా తోట ప్రకటించారు. తర్వాత ఒకరిద్దరు బీఆర్ఎస్లోకి మారారు. కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఆ వర్గానికి చెందిన శాంతి కుమారిని నియమించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మూలాలున్న మహిళ. అయినా ఏపీలో బీఆర్ఎస్ టేకాఫ్ సగంలోనే ఆగిపోయింది.
బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా విశాఖ లేదా విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొన్ని రోజుల తర్వాత విజయవాడలోనే సభ ఉంటుందని అన్నారు. ఈ లోపు అడపా దడపా కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చేవి. అవి విజయవాడలో ఎక్కువ కనిపించేవి. తర్వాతి కాలంలో ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అంత సులభం కాదని కేసీఆర్ అర్థం చేసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించే అవకాశం లేనట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉండేందుకు ఎవరూ ఉత్సాహం చూపించడం లేదని అంటున్నారు. ఏపీలో బంధుత్వం ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కొంతమంది ఏపీ యాదవ సామాజికవర్గం నేతలకు కలుపుకుపోవాలనుకుంటే వాళ్లు ఆసక్తి చూపలేదు. ఎక్కువకాలం ఏపీలో ఉద్యోగం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఎవ్వరినీ ఆకర్షించలేకపోయారు. దానితో ఏపీపై కొంత కాలం మౌన రాగాలు ఆలాపించాలని కేసీఆర్ డిసైడయ్యారట..