దిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ భయపడుతున్నారా?

కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా మారినా కూడా తన ఫాంహౌస్‌ను, హైదరాబాద్‌ను వదిలి దూరం వెళ్లడం లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్న ఆయన దేశ రాజధాని దిల్లీ వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు జోరుగా సాగుతున్నా… తనతో కలిసి నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తినా అటువైపు చూడడం లేదు.. దేశ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కలలు కంటున్న కేసీఆర్ దిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతారని.. దిల్లీలో కూర్చుని ఇతర పార్టీల నేతలను కలుస్తారని, మేధావులతో సమావేశాలు నిర్వహిస్తారని.. మీడియాతో మాట్లాడుతారని చాలామంది అనుకున్నారు. కానీ… ఆయన మాత్రం అటువైపే చూడడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవడంతో దిల్లీలో ఆమె హడావుడే ఎక్కువగా కనిపించింది.. ఆ నేపథ్యంలో కేసీఆర్ కనుక దిల్లీ వస్తే ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై పడుతుందన్న భయంతోనే ఆయన దిల్లీ వైపు చూడడం లేదని సమాచారం.

గతంలో కేసీఆర్ దిల్లీ వస్తే నాలుగైదు రోజులు ఉండేవారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం వచ్చారు. అనంతరం మళ్లీ రాలేదు. ప్రస్తుత పరిస్థితులలో దిల్లీ వస్తే లిక్కర్ కేసుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయని.. మీడియాతో మాట్లాడడం కష్టమని భావించే ఆయన మొహం చాటేస్తున్నట్లు చెప్తున్నారు.

లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం… ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు మంచి అవగాహన ఉండడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. దిల్లీ వెళ్తే కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంటుంది. కేంద్రంలోనిబీజేపీతో పోరాడుతానంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినేతగా దిల్లీ వెళ్తే ఇతర పార్టీల నేతలను కలవాల్సిఉంటుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితులలో అది ఏమంత సరైన నిర్ణయం కాదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ దిల్లీ వెళ్లకుండా హైదరాబాద్‌కు పరిమితం అవుతున్నట్లు చెప్తున్నారు.