ప్రధాని నరేంద్ర మోడీపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై దూసుకుపోతున్న తెలంగాణ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్.. తాజాగా శోభకృత్ నామ ఉగాదిని పురస్కరించుకుని మోడీపై కేటీఆర్ ఉగాది చెమక్కులు విసిరారు. వాస్తవానికి ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన, ఆమెను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో తరచుగా మోడీని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు కూడా “ఇవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు” అని కేటీఆర్ చురకలు అంటించారు.
అదేసమయంలో రాష్ట్రానికి అప్పులు చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చకపోవడం.. వంటి వాటిపైనా కేటీఆర్ సహా కేసీఆర్ కుటుంబం నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని.. కేటీఆర మోడీపై పంచ్‌లు గుప్పించారు. ఆసక్తికర వ్యాఖ్యలతో చమక్కులు మెరిపించారు. దేశీయ పంచాంగం పేరుతో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఇది ఆద్యంత ఆసక్తిగా ఉండడంతో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆదాయం: అదానీకి
వ్యయం: జనానికీ, బ్యాంకులకు
అవమానం: నెహ్రూకి
రాజ్యపూజ్యం: గుజరాతీ గ్రూప్‌కి
బస్.. బభ్రాజమానం.. భజగోవిందం
దేశీయ పంచాంగం సమాప్తం
- అని కేటీఆర్ చేసిన ట్వీట్ వేలల్లో లైకులు సంపాయించింది.