పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి షాకిచ్చాయి. అనూహ్యంగా మూడు చోట్ల పరాజయం పాలు కావటంతో అధికార పార్టీకి దిమ్మతిరిగింది.టీడీపీలో జోష్ కనిపిస్తుండగా. వైసీపీలో ఎక్కడ లేని టెన్షన్ తప్పడం లేదు. అందుకు ఒక కారణం కూడా ఉంది. అదే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలుగా చెప్పుకోవాలి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగడంతో వైసీపీకి దిక్కుతోచడం లేదు.
ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరుగుతాయి. మొత్తం ఏడు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వైసీపీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. సంఖ్య బలం చూసుకుని టీడీపీ పోటీ చేయదనుకున్న వైసీపీ ఇప్పుడు తప్పులో కాలేసినట్లయ్యింది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీసీ మహిళ పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగారు. దానికి ఇప్పుడు లెక్కలేసుకుంటున్న వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి…
ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏడో అభ్యర్థి గెలవాలంటే 22 తొలి ప్రాధాన్య ఓట్లు రావాలని చెబుతున్నారు. నిజానికి అసెంబ్లీ వైసీపీ తరపున 151 మంది గెలిచారు. టీడీపీ తరపున 23 మంది నెగ్గారు. జనసేన ఒక అభ్యర్థిని గెలిపించుకు్ంది. టీడీపీకి చెందిన నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ పంచన చేరారు. దానితో తమ విజయానికి ఇబ్బంది లేదనుకుని జగన్ ధైర్యంగా ఏడుగురిని రంగంలోకి దించారు.
టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగిన తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది. వైసీపీపై అలిగిన నెల్లూరు పెద్దారెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. నలుగురు దూరం జరగడం కారణంగా టీడీపీ బలం 19కి పడిపోయినా.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఓటేస్తే వచ్చే ఓట్ల సంఖ్య 21కి పెరుగుతోంది..
అనురాధ గెలవాలంటే ఇంకో ఓటు వస్తే సరిపోతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ ఎదురుచూడటం వల్లే అభ్యర్థిని నిలబెట్టారని అంటున్నారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటే ఇప్పుడు అనురాధకు ఓటేస్తామని చెబుతున్నారట. విశ్వాసం కలిగించేందుకు కావాలంటే ఓటును చూపించి మరీ వేస్తామంటున్నారట. అయితే టీడీపీ వైపుకు రావాలనుకుంటున్న వారికి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని తెలియడంతో వారి సాయం తీసుకునేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో తమ నాయకులు వ్యతిరేకించే వీలుందని కూడా భావిస్తున్నారు. అయినా ఆ ఒక్క ఓటుకు ఇబ్బందేమీ లేదన్నది టీడీపీ ధీమా..