ఏడుగురు ముఖ్యమంత్రుల్ని పిలిస్తే ఒక్కరు రాలేదట!

మచ్చ పడిన వేళ ఏం చేయాలి? ఆ మచ్చను విజయవంతంగా చెరిపించుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకు భిన్నంగా తన తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే మొహమాటం కోసమైనా హాజరయ్యే వారేమో. కానీ.. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. చూస్తూ.. చూస్తూ ఆయనతో పెట్టుకోవటం ఎందుకు అనుకున్నారో కానీ.. ముచ్చట పడి విందునకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి మిగిలిన సీఎంలు అంతా కలిసి గైర్హాజరుతో షాకిచ్చిన వైనం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గడిచిన శనివారం ఒక రాజకీయ విందునకు ప్లాన్ చేశారట. బయటకు రాని ఈ ఉదంతం.. కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దేశంలోని బీజేపీ.. కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యమంత్రులు కాకుండా మిగిలిన ముఖ్యమంత్రుల్లో ఏడుగురిని (ఆయనతో పాటు ఎనిమిది) ఢిల్లీకి ఆహ్వానించారు.

దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు. ప్రోగ్రెసివి చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా పొట్టిగా చెప్పాలంటే “జీ8” పేరుతో ఆయన ఒక విందు భేటీకి ఆహ్వానించారు. వచ్చే ఏడాది లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ఆయన.. అందులో భాగంగా ఈ రాజకీయ విందు భేటీకి ఆహ్వానం పంపారు. అయితే.. కేజ్రీవాల్ అంచనాలకు భిన్నంగా ఈ విందునకు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాని వైనం షాకింగ్ గా మారింది. తాను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఏడుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఢిల్లీ మెహం చూడకపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత మోడీనా మజాకానా? అన్న మాట మనసులో మెదలక మానదు.