జగన్ మరిచిపోతున్న లాజిక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఇచ్చే ఎలివేషన్లకు.. ఆయన మాట్లాడే మాటలు, చేసే చేతలకు అసలు పొంతన ఉండట్లేదు. మాటకు ముందు వీరుడు శూరుడు.. మొనగాడు.. పులి.. సింహం.. లాంటి ఉపమానాలతో ఆయనకు ఎలివేషన్ ఇస్తుంటారు ఫ్యాన్స్. కానీ వాస్తవం చూస్తే మాత్రం వేరుగా కనిపిస్తుంది. ఆయన పర్యటనల సమయంలో పరదాలు కట్టడం.. బారికేడ్లు కట్టించడం.. చెట్లు కొట్టించడం లాంటివి చూసి అవాక్కవ్వని వారు లేరు. భద్రత కోసం అని చెప్పొచ్చు కానీ.. దేశంలో మరే ముఖ్యమంత్రి పర్యటనల విషయంలోనూ ఇలా జరగని విషయం గమనార్హం.

ఇదిలా ఉంటే.. జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయడం.. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ పడటం గురించి ఈ మధ్య కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే జగన్ ఓటమి తథ్యం అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండగా..ఆ పార్టీల పొత్తు పొడవకుండా చూసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.

దమ్ముంటే సింగిల్‌గా రండి.. పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు… అది అక్రమ బంధం.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఇటు టీడీపీ, అటు జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టడం అదే పనిగా చేస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ సైతం ఇదే పాట పట్టుకుంటున్నాడు. మాటకు ముందు సింగిల్‌గా సింహంలా వస్తున్నా.. మీకు దమ్ముంటే పొత్తు లేకుండా పోటీ చేయండి అంటున్నారు.

ఐతే రాజకీయాల్లో పొత్తులు అన్నవి కొత్త కాదు. అది తప్పు కూడా కాదు. జగన్ తండ్రి వైఎస్ సైతం పొత్తుల మీద ఆధారపడే 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జగన్, ఆయన పార్టీ మాత్రం పొత్తు మహా పాపం అన్నట్లు మాట్లాడుతోంది. ఒకసారి రెండుసార్లు అంటే ఓకే కానీ.. పదే పదే జగన్ స్థాయి వ్యక్తి.. పొత్తు లేకుండా రండి అని సవాలు చేయడం జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్లేలా చేస్తోంది. టీడీపీ, జనసేన కలిస్తే తన పనైపోతుందని.. ఓటమి తథ్యమని.. ఆ భయంతోనే జగన్ పదే పదే ఆ మాట అంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందులోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలాక జగన్ ఈ మాట అనడంతో జగన్‌ భయం పెరుగుతున్న సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లాజిక్ అర్థం కాకుండా జగన్ పదే పదే ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసరడం కరెక్ట్ కాదని ఆ పార్టీ వాళ్లే అభిప్రాయపడుతున్నారు.