నేను గౌత‌మ బుద్ధిడుని కాదు.. : స్పీక‌ర్ త‌మ్మినేని

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. త‌నేంటో చెప్పేశారు. తానేమీ గౌత‌మ బుద్ధిడిని కాద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఆయ‌న “శ్రీరామచంద్రుడు” అని స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. సోమ‌వారం నాటి స‌భ‌లో టీడీపీ నేత‌లు.. వైసీపీ స‌భ్యుల వివాదాల‌తో అట్టుడికిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత‌.. స్పీక‌ర్ మాట్లాడారు.

టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని స్పీక‌ర్ త‌మ్మినేని చెప్పారు. కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా తాను వాటిని పూవులుగానే భావించానని, అయినా తానేమీ గౌతమ బుద్ధుడిని కాదన్నారు. శ్రీరామ చంద్రుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నారని, రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసునని తమ్మినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని, సభకు, సభాపతి స్థానానికి గౌరవం లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సభ్యులు పోడియం వద్ద, సభాపతి స్థానం వద్దకు వచ్చి ఆటంక పరిస్తే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ అయ్యేలా రూలింగ్ ఉందని తమ్మినేని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు.

దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.