ఏపీ అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించి.. వాటిని పరిష్కరించేందుకు మార్గాలు వెతకాల్సిన అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల మధ్య వ్యక్తిగత కక్షలు చోటు చేసుకుంటున్నాయా? తమ తమ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన గొడవలను.. వారి మధ్య ఉన్న పగ, కక్ష, కార్పణ్యం వంటివాటిని సభలో ప్రస్ఫుటీకరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
శాసన సభ ఉన్నది మీ వ్యక్తిగత వ్యవహారాలు చర్చించుకునేందుకు కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న ది వారి సమస్యలపై మీరు చర్చిస్తారని. అంతేకాదు.. మీరే ఒక సమస్యగా మారి.. చర్చకు కేంద్రం అవుతారని కాదు
– తొలి ఆంధ్రప్రదేశ్‌శాసన సభకు సారథిగా ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు అన్న అమృత వాక్కులు ఇవి! కానీ, ఈ వ్యాఖ్యలు ఆనాడే అంతరించిపోయాయి.
ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక అజెండా ఏర్పాటు చేసుకుని.. సభలో సంప్రదాయాలను మంటగలిపేలా వ్యవహరిస్తుండడం.. ఒక్క ఏపీ అసెంబ్లీలోనే కాదు.. దేశవ్యాప్తంగా చట్టసభల్లో కనిపిస్తున్న పరిణామం. ఫలి తంగా ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతోందని చెబుతున్న విమర్శకుల మాటల్లో అంతరార్థాన్ని కాదనగలిగే నాయకుడు, ఖండించే పార్టీకూడా లేకుండా పోవడం గమనార్హం.
నువ్వు ఒకటను.. నేరెండంటా. సభ వాయిదా పడిపోతుంది!
నిరుడు త్రిపుర అసెంబ్లీలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులు చేసుకున్న ఒప్పందం తాలూకు ఫోన్ ఆడియోలు వెలుగు చూసి.. దేశంలో ప్రకంపనలు సృష్టించినా.. ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటున్నారంటూ.. సాక్షాత్తూ పార్లమెంటులోనే డబ్బుల కట్టలు బయటకు చూపించినా.. చర్యలు తీసుకున్న నాధుడు కనిపించలేదు.
ఫలితంగా.. ప్రజాసమస్యలకు, ప్రజాభ్యుదయానికి వేదికలుగా తలమానికంగా ఉండాల్సిన చట్టసభలు వ్యక్తిగత వ్యవహారాలకు.. కక్షలకు.. కీలక వేదికలుగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ఈ పోకడ ఇప్పుడు కొత్తకాదు. గత చంద్రబాబు హయాంలో జగన్ కూటమి, ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు కూటమి కూడా అలానే చేస్తోంది.
ఎవరు అధికారంలో ఉంటే.. వారు ఎదుటివారిపై నిందలు వేస్తున్నారే తప్ప.. వాస్తవానికి సభకు ఒక సంప్రదాయం ఉందని.. దానిని గౌరవించాలనే కనీస స్పృహను కూడా కోల్పోతున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సింది.. ప్రజలే. అది కూడా తమ ఓటుతోనే!!