వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గ్రాఫ్ పెరిగిందా? తరిగిందా? ఏం జరుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కీలక చర్చ. దీనికి కారణం .. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. జనసేన-టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ.. నరసాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తారని సమాచారం.
టీడీపీ తరఫున తాను పోటీచేయనున్నట్టు చూచాయగా సదరు ఎంపీ చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు ఇప్పుడు ఎంపీ పరిస్థితి ఏంటి? ఆయన పోటీకి దిగితే నిలిచి గెలిచే పరిస్థితి ఉందా? అనేది ఆసక్తికర చర్చ. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంపీని అసలు రాష్ట్రంలోకే అడుగు పెట్టకుండా.. వైసీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని.. సదరు ఎంపీనే విమర్శలు గుప్పిస్తున్నారు.
తనను హైదరాబాద్ వస్తేనే వెంటాడుతున్నారని రఘురామ చెబుతున్నారు. సరే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి? ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ప్రచారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నే అనేక సందేహాలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ప్రస్తుతం క్షత్రియ సామాజిక వర్గంలో రఘురామపై సానుభూతి ఉంది. ఆయన పట్ల వారు సానుకూలంగానే ఉన్నారు.
అయితే, ఎన్నికల నాటికి క్షత్రియులను కూడా ఓటు బ్యాంకు రూపంలో చీల్చే ప్రయత్నాలు జోరుగా సాగుతుండడం.. ఇక్కడ వైసీపీకి అనుకూలంగా పావులు కదుపుతుండడం ఎంపీ విషయంపై చర్చకు దారితీస్తోంది. పైగా.. గతంలో టీడీపీ ఇక్కడ గెలిచిన పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు రఘురామ టీడీపీ తరఫున పోటీకి దిగితే.. సానుకూల పవనాలు ఏమేరకు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ తరఫున కాకుండా.. ఆయన ఒంటరిగానే బరిలోకి దిగితే.. సానుభూతి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates