‘లెక్క‌లేన‌న్ని ఆధారాలు.. అవినాష్ త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మే’

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా చూడాల‌ని.. ఆయ‌న హైకోర్టుకు వెళ్లినప్ప‌టి నుంచి అవినాష్ విష‌యం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. అస‌లు ఏమీ లేన‌ప్పుడు.. తాను ఏ పాపం ఎరుగ‌న‌ప్పుడు.. అరెస్టు చేయొద్ద‌ని ఆయ‌న కోరుతున్నారంటే.. అనుమానించాల్సిందేన‌ని న్యాయ‌నిపుణులు కూడా చెబుతున్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన సాక్ష్యాలు.. ఇత‌ర‌త్రా అనేక ఆధారాల విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై స్పందిస్తున్న న్యాయ నిపుణులు.. ఇన్ని ఆధారాలు పెట్టుకునే సీబీఐ ఇంత‌గా అవినాష్ ను టార్గెట్ చేస్తోంద‌ని.. సీబీఐ ఏం చేసినా.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించే స్తుంద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి.. అవినాష్ ఇప్పుడు త‌ప్పించుకున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాద‌ని.. తెలంగాణ‌కు చెందిన న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇక‌, సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన సాక్ష్యాల్లో.. కీల‌క‌మైన‌వి నిపుణులు భావిస్తున్న‌వి చూస్తే.. హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక కీల‌కంగా మారింది. అదేవిధంగా, హార్డ్‌ డిస్క్‌, 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. వివేకా డెత్‌ నోట్‌, ఫోరెన్సిక్‌ నివేదిక, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫొటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేసింది. ఇవి కూడా ముఖ్యమైన‌వేన‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. ఈ ఆధారాల‌ను బ‌ట్టే.. హత్యా స్థలిలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాదులు అనిల్‌కుమార్‌, నాగేంద్రన్‌ హైకోర్టుకు నివేదించిన విష‌యాన్ని నిపుణులు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. తాత్కాలికంగా అరెస్టు నుంచి కొంత ఊర‌ట ల‌భించిన‌ప్ప‌టికీ.. అవినాష్ మాత్రం ఈ కేసు నుంచి త‌ప్పించుకోలేర‌ని నిపుణులు తెగేసి చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.